మారిషస్ పెట్టుబడులపై ఇక పన్నుల మోత

11 May, 2016 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ : మారిషస్ దేశం నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధనం లాభాలపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పన్ను విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే పెట్టుబడుల మూలధన లాభాలపై మొదటిసారి పన్నులు విధించనుంది. దేశీయ ధరల ప్రకారం మూలధన లాభంపై 50శాతం మేర పన్ను విధించనుంది.

చాలాకాలంగా ఈ పన్ను విధింపుపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మారిషస్, సింగపూర్ ల నుంచి భారత్ లోకి వచ్చే పెట్టుబడులు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ వాటిపై 1983 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకూ ఎలాంటి పన్ను విధింపులు లేవు. దీంతో ఇటు భారతీయ కంపెనీలు, అటు బహుళ జాతి కంపెనీలు పన్నులనుంచి తప్పించుకుంటున్నాయి. భారత్ లో పన్నులు ఎగవేసి నల్లధనాన్ని మారిషస్ కు తరలించి, మళ్లీ భారత్ లో విదేశీ పెట్టుబడుల రూపంలో పెట్టుబడి పెడతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులపై కూడా మూలధన లాభ పన్ను విధించాలని నిర్ణయించింది. పన్నుఎగవేతలను, తీవ్రంగా ప్రబలుతున్న నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

ఒప్పందంలోని వివరాలు....
భారత్, మారిషస్ డీటీఏఏ లోని ఆర్టికల్ 13(4) ప్రకారం, మారిషస్ కు చెందిన కంపెనీలు, భారత్ లో వాటాల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై కేవలం మారిషస్ లో మాత్రమే పన్నులు చెల్లించేవారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటినుంచి భారత్ లో కూడా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుల రేటు దేశీయ పన్ను రేటుకు 50శాతం మించదని ప్రభుత్వం తెలిపింది. 2017 ఏప్రిల్1కు ముందు జరిగే వాటికి ఇది వర్తించదని పేర్కొంది. ఈ ఒప్పంద కాలం 2017 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు ఉండనుంది. అనంతరం దేశీయ పన్నులకు సమానంగా ఈ పెట్టుబడుల మూలధనంపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మారిషస్ దేశంగా పనిచేసే కంపెనీ అయి ఉండి, 27 లక్షల ఖర్చును ఆ కంపెనీ చూపిస్తే, పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

మారిషస్ నుంచి భారత్ లో పెట్టుబడులు పెట్టే ఇన్ స్టిట్యూషనల్ ఫండ్స్, అసెట్ మేనేజర్స్, కంపెనీలపై ఈ మూలధన లాభ పన్నుల ప్రభావం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మారిషస్ లో కంపెనీలు ఏర్పాటుచేసుకుని, మూలధన లాభాలనుంచి పన్ను తప్పించుకుంటూ.. స్వల్పంగా మారిసస్ లో పన్ను చెల్లిస్తున్న భారత కంపెనీలకు ఈ నిర్ణయం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 

2000 సంవత్సరం నుంచి వచ్చే విదేశీ ఈక్విటీ పన్నుల్లో దాదాపు 27,800 కోట్ల డాలర్లు మారిషస్ దేశం నుంచే ఉన్నాయి. మొత్తం పెట్టుబడులో ఇవి 3/4వ వంతు. మారిషస్, సింగపూర్ దేశాల పెట్టుబడులే మనదేశంలో ఎక్కువగా ఉంటున్నాయి. సింగపూర్ తో కూడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు