త్వరలో బ్యాంక్‌ ఈటీఎఫ్‌ 

20 Feb, 2019 02:19 IST|Sakshi

ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు 

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఈటీఎఫ్‌(ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లతో కూడిన బ్యాంక్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ బ్యాంక్‌ ఈటీఎఫ్‌లో చేర్చాల్సిన బ్యాంక్‌ షేర్లు, వాటి వెయిటేజీపై కసరత్తు చేస్తున్నామని ఆ అధికారి వివరించారు. బ్యాంక్‌ షేర్లపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ బ్యాంక్‌ ఈటీఎఫ్‌  మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ఒక్కో బ్యాంక్‌షేర్‌ పట్ల ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపకపోయినా, బ్యాంక్‌ షేర్లతో కూడిన ఈటీఎఫ్‌కు మంచి డిమాండ్‌ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం వాటాలు 63–83 శాతం రేంజ్‌లో ఉన్నాయి.  

ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లు... 
కేంద్రం ఇప్పటికే రెండు ఈటీఎఫ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న రెండు ఈటీఎఫ్‌లు–సీపీఎస్‌ఈ ఈటీఎఫ్, భారత్‌–22 ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా ప్రభుత్వం 2017 నుంచి రూ.32,900 కోట్లు, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా 2014 నుంచి రూ.28,500 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.53,558 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది.   

>
మరిన్ని వార్తలు