హాకిన్స్‌ కుకర్స్‌- బంధన్‌ బ్యాంక్‌- బోర్లా

22 May, 2020 11:49 IST|Sakshi

హాకిన్స్‌కు క్యూ4 ఫలితాల దెబ్బ

బంధన్‌ బ్యాంక్‌కు తుఫాన్‌ షాక్‌

భారీగా పతనమైన షేర్లు

వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో కోతతోపాటు.. రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను మరో మూడు నెలలపాటు ఆర్‌బీఐ పొడిగించడంతో స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 350 పాయింట్లు క్షీణించి 30,583ను తాకగా.. నిఫ్టీ 102 పాయింట్లు నీరసించి 9,004 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హాకిన్స్‌ కుకర్స్‌, బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

హాకిన్స్‌ కుకర్స్‌
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో కిచెన్‌వేర్‌ కంపెనీ హాకిన్స్‌ కుకర్స్‌ షేరు డీలాపడింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 7 శాతం(రూ. 318) కుప్పకూలి రూ. 4227 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3985 వరకూ దిగజారింది. ఇది 12 శాతం పతనంకాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హాకిన్స్‌ కుకర్స్‌ నికర లాభం 31 శాతం క్షీణించి రూ. 9.4 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 21 శాతం తగ్గి రూ. 146 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం సైతం 36 శాతం వెనకడుగుతో రూ. 13 కోట్లను తాకింది.

బంధన్‌ బ్యాంక్‌
ఈ వారం మొదట్లో చెలరేగిన అంఫన్‌ తుఫాన్‌ కారణంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిషాలలోని కొన్ని ప్రాంతాలలో కార్యకలాపాలకు దెబ్బతగిలినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. రూ. 260 కోట్ల విలువైన బిజినెస్‌ ప్రభావితమయ్యే వీలున్నదని తెలియజేసింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంధన్‌ బ్యాంక్‌ ప్రధానంగా 49 యూనిట్లు తుఫాన్‌ ప్రభావానికి లోనైనట్లు వెల్లడించింది. అయితే ఐదు జిల్లాలలో దాదాపు కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో బంధన్‌ బ్యాంక్‌ షేరు 5.5 శాతం పతనమై రూ. 199 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 195 సమీపానికి క్షీణించింది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 11 శాతం నీరసించడం గమనార్హం!

మరిన్ని వార్తలు