హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.138 కోట్లు 

25 Apr, 2019 01:02 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌  

న్యూఢిల్లీ: మిడ్‌– సైజ్‌ ఐటీ సేవల కంపెనీ హెక్స్‌వేర్‌టెక్నాలజీస్‌ ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని, 3 శాతం వృద్ధి సాధించామని హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,049 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.1,264 కోట్లకు పెరిగిందని కంపెనీ చైర్మన్‌ అతుల్‌ నిశార్‌ చెప్పారు. మరోసారి రెండంకెల వృద్ధిని సాధించామని, పరిశ్రమకే తలమానికమైన వృద్ధిని సాధించాలన్న తమ తపనకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీజనల్‌గా బలహీనంగా ఉన్నప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ, ఈడీ ఆర్‌. కృష్ణ తెలిపారు. ఈ క్వార్టర్‌కు గాను ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.

ఈ కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది.  డాలర్ల పరంగా చూస్తే, ఈ మార్చి క్వార్టర్లో నికర లాభం 5 శాతం క్షీణించి 1.97 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధి చెంది 18 కోట్ల డాలర్లకు చేరిందని నిశార్‌ తెలిపారు. గత ఆరు నెలల్లో 304 మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,509గా ఉందని తెలిపారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) 18.2 శాతంగా ఉందని కృష్ణ వివరించారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌ నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.870 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.333 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు