సరికొత్త ‘శాంత్రో’ వచ్చేసింది

24 Oct, 2018 00:22 IST|Sakshi

ధర రూ.3.89–5.64 లక్షలు

పెట్రోల్‌ కారు మైలేజీ 20.3 కి.మీ./లీ

13 రోజుల్లో 23,500 బుకింగ్స్‌ పూర్తి  

న్యూఢిల్లీ: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హ్యుందాయ్‌ శాంత్రో’ రానేవచ్చింది. హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) మంగళవారం ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దేశీ రోడ్లపై 16 ఏళ్ల పాటు ప్రయాణించి... 2014 డిసెంబర్‌ నుంచి నిలిచిపోయిన ఈ కారు.. ఫ్యాక్టరీ నుంచే సీఎన్‌జీ ఇంధన ఆప్షన్, 5 స్పీడ్‌– ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ), 1.1 లీటర్, ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ వంటి అధునాతన ఫీచర్లతో రీ ఎంట్రీ ఇచ్చింది.

5 స్పీడ్‌– మాన్యువల్‌ వేరియంట్‌ శాంత్రో ధరల శ్రేణి రూ.3.89 లక్షలు– రూ.5.45 లక్షలు, సీఎన్‌జీ వేరియంట్స్‌ ధరలు రూ.5.23 –రూ.5.64 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటెడ్‌ గేర్‌ షిఫ్ట్‌ ధరలు రూ.5.18 లక్షలు–రూ.5.46 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. పెట్రోల్‌ వెర్షన్‌ లీటర్‌కు 20.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, సీఎన్‌జీ వెర్షన్‌ కేజీకి 30.48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.  

ఒక్కరోజులో 1,000 బుకింగ్స్‌
ప్రారంభ ఆఫర్‌ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కంపెనీ ప్రకటించింది. బుకింగ్స్‌ ప్రారంభమైన 13 రోజుల్లో 23,500 ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ అందినట్లు సంస్థ సీఈఓ వై.కే కూ తెలిపారు. ఒక్కరోజులో వెయ్యి బుకింగ్స్‌ వచ్చాయన్నారు.

‘‘నాలుగేళ్ల విరామం తరువాత మిడ్‌–కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో మరోసారి అడుగుపెట్టాం. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టాం. నెలకు 8,000–9,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. దక్షిణ కొరియా, చెన్నైలోని పరిశోధన అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు.. ఎంతో శ్రమించి నూతన శాంత్రోను, కారు ప్రియుల ఆలోచనలకు తగినట్లుగా రూపొందించాయి.’ అని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు