చర్మం పొడిబారుతోందా!

24 Oct, 2018 00:18 IST|Sakshi

బ్యూటిప్స్‌

చలికాలం రావడానికి ముస్తాబు అవుతోంది. పగటి వేళ ఎండగానూ, రాత్రి వేళ కాస్త చలిగా ఉండడం సహజంగా జరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మ సంరక్షణ పట్ల ముఖ్యంగా పొడి చర్మం గలవారు తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

వేడి నీళ్లతోనూ, చల్లని నీళ్లతోనూ కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ముఖానికి పదే పదే సబ్బు వాడకుండా వెచ్చని నీటితో రోజులో రెండు – మూడు సార్లు కడగాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.  ఈ కాలం గాలిలో తేమ తక్కువ. దీని వల్ల ఒంటిమీద ఉండే స్వేదం కూడా త్వరగా ఆరిపోతుంటుంది. దీంతో చర్మం పొడిబారినట్టు అవుతుంది. ఈ సమస్య రాకుండా 2 నుంచి 4 లీటర్ల నీళ్లు రోజులో తప్పనిసరిగా తాగాలి.   రాబోయే కాలంలో మృతకణాల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ఎక్కువసేపు స్క్రబ్‌ చేయకూడదు. మీ చర్మతత్త్వం ఏదో తెలుసుకొని తగిన సౌందర్య ఉత్పాదనలను ఎంపిక చేసుకొని వాడాలి.

పనుల వల్ల పాదాలు, చే తులు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి. దీంతో వీటి పై చర్మం త్వరగా తేమ కోల్పోతుంది. అలాగే వదిలేస్తే పగుళ్లు బారే అవకాశం ఉంది. అందుకని, రాత్రివేళ తడి లేకుండా చేతులను తుడిచి మాయిశ్చరైజర్‌ రాసి, గ్లౌజ్‌లను వేసుకోవాలి.   గ్లిజరిన్‌ ఉండే క్రీమ్స్, పెట్రోలియమ్‌ జెల్లీ మాయిశర్చరైజర్లు పాదాల చర్మాన్ని పొడిబారనివ్వవు. వారానికోసారి పాదాలను స్క్రబ్బర్‌తోరుద్ది, కడిగాలి. పడుకునే ముందు పెట్రోలియమ్‌ జెల్లీ రాసి, సాక్స్‌లు వేసుకోవాలి.  చర్మం దురద పెడుతుంటే పొడిబారి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే, ఒక్కోసారి అవి రకరకాల చర్మ సమస్యలకు కారణమై ఉండచ్చు. 
 

మరిన్ని వార్తలు