2019–20లో జీడీపీ వృద్ధి 7.4 శాతం 

22 Dec, 2018 01:50 IST|Sakshi

ఐసీఐసీఐ బ్యాంకు అంచనా

ముంబై: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వరకు నమోదు కావచ్చని ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గించింది. వినియోగం సెప్టెంబర్‌ త్రైమాసికంలో తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వృద్ధి వేగంగా పుంజుకోకపోవచ్చని తాము భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్స్‌ హెడ్‌ బి ప్రసన్న తెలిపారు. వృద్ధి రికవరీ వినియోగం ఆధారితంగా కాకుండా పెట్టుబడి ఆధారితంగా ఉంటుందన్నారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రభావాల నుంచి రియల్‌ ఎస్టేట్, చిన్న స్థాయి పరిశ్రమలు ఇంకా బయటపడకపోవడం వృద్ధికి ప్రధాన అవరోధాలుగా ఐసీఐసీఐ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. కమోడిటీ ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చని, కానీ, చమురు ధరలు వృద్ధిని నిర్ణయించే అంశంగా ప్రసన్న తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత  కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం వృద్ధికి, మార్కెట్లకు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు