ఫ్రాన్స్‌ను దాటేసి భారత్‌ దూసుకుపోయింది!

11 Jul, 2018 11:49 IST|Sakshi

పారిస్‌ : ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌, ఫ్రాన్స్‌ను దాటేసింది. ఫ్రాన్స్‌ను అధిగమించి ఆరో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించింది. దీంతో ఫ్రాన్స్‌ ఏడో స్థానానికి పరిమితమైంది. 2017 ప్రపంచం బ్యాంక్‌ అప్‌డేటెడ్‌ గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది ముగింపు నాటికి దేశీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2.597 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంక్‌ గణాంకాల్లో తెలిసింది. ఇక ఫ్రాన్స్‌ జీడీపీ 2.582 ట్రిలియన్‌ డాలర్లుగా నమోదైంది. పలు త్రైమాసికాల పాటు ఎ‍న్నో ఒడిదుడుకులకు లోనైన దేశీయ ఆర్థిక వ్యవస్థ 2017 జూలై నుంచి పుంజుకుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 

భారత్‌ సుమారు 1.34 బిలియన్‌ జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా గల దేశంగా పేరొందిందని, ఫ్రాన్స్‌లో జనాభా శాతం చాలా తక్కువగా 67 మిలియన్లే ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు షాకిస్తూ ప్రభుత్వం తీసుకున్న డీమానిటైజేషన్‌, 2016 జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ అనంతరం, తయారీ, వినియోగదారుల ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతో కీలక పాత్ర పోషించాయని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. దశాబ్దం వ్యవధిలోనే భారత జీడీపీ రెండింతలు అయిందని తెలిపింది. ఈ ఏడాది కూడా భారత్‌ 7.4 శాతం వృద్ధిని, 2019లో 7.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ అంచనావేస్తోంది. పన్ను సవరణలు, గృహ వ్యయాలు వృద్ధికి బూస్ట్‌ ఇస్తున్నాయని తెలిపింది. 

గతేడాది చివరి వరకు జీడీపీ పరంగా బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను రెండింటినీ భారత్‌ అధిగమించేసిందని లండన్‌ కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ కన్సల్టెన్సీ వెల్లడించింది. 2032 వరకు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో అమెరికా టాప్‌లో ఉండగా.. చైనా, జపాన్‌, జర్మనీలు దాని తర్వాత స్థానంలో ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు