నల్లధనంపై భారత్ వద్ద తగిన ఆధారాలు

23 Jan, 2015 02:07 IST|Sakshi
నల్లధనంపై భారత్ వద్ద తగిన ఆధారాలు

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
* సమాచారం ఇచ్చేందుకు  స్విస్ ఓకే!

దావోస్: స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న తన పౌరుల గురించి భారత్ ఇప్పటికే తగిన వివరాలు సమీకరించిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇక్కడ పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి సహకారాన్ని అందించడానికి, సమాచారాన్ని అందిపుచ్చుకోడానికి స్విట్జర్లాండ్ అంగీకరించిందని కూడా తెలిపారు.

అంతకుముందు ఆయన స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రి విండ్‌మిర్-ష్వాలూంఫ్‌తో దాదాపు 40 నిముషాల పాటు చర్చలు జరిపారు.  దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశాలను పురస్కరించుకుని ఆర్థికమంత్రి పలు దేశాల ఆర్థికమంత్రులతో సమావేశమవుతున్నారు.
 
9 శాతం వృద్ధి సాధన సత్తా
కాగా భారత్‌కు 9 శాతం వృద్ధి రేటు సాధించే సత్తా ఉందని ఆర్థికమంత్రి అన్నారు. గురువారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ, వచ్చే ఏడాది వృద్ధి మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొద్ది కాలంలో ద్రవ్యలోటును 3 శాతం దిగువకు తగ్గించడానికి తాము ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్రూడ్ ధరలు దిగువ స్థాయిల్లో కొనసాగుతున్నందున ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమేనని కూడా స్పష్టం చేశారు.
 
కిరోసిన్ విభాగంలో సంస్కరణలు
కాగా భారత్‌లో సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీటి హేతుబద్దీకరణకు తగిన ప్రయత్నమంతా కేంద్రం చేస్తుందని తెలిపారు. ఈ దిశలో సత్వర సంస్కరణలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంలో కిరోసిన్ సబ్సిడీ సంస్కరణకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.

అయితే దీనర్థం సబ్సిడీలను ఉపసంహరిస్తామని కాదని, కేవలం పేదలకు పూర్తి ప్రయోజనం చేకూర్చేలా ఈ సబ్సిడీ విధానాన్ని హేతుబద్దీకరించడం ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)ను 4.1 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
 
సంయుక్త సమావేశాలు...

వస్తువులు, సేవల పన్నుల (జీఎస్‌టీ) బిల్లు రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. బీమా బిల్లు ఆమోదం పొందకపోయినా లేదా ఈ విషయంలో ఆరు నెలలకు మించి ఆలస్యం జరిగినా కేంద్రం సంయుక్త పార్లమెంటు సమావేశం నిర్వహించి దీని ఆమోదానికి చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పటిష్టవంతమైన పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
 
పెద్ద ఆశలు పెట్టను: జైట్లీ
కాగా బడ్జెట్‌కు సంబంధించి  పన్నుల అంశాలుసహా పలు విధానాల్లో భారీ ఆశలేవీ పెట్టబోనని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు. అయితే సంస్కరణల ప్రక్రియ కొనసాగింపు దిశలో నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాత్రం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

‘బడ్జెట్ ఒకరోజు మాత్రమే. ఏడాదిలో ఇంకా 364 రోజులు ఉంటాయి’ అని కూడా జైట్లీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టిన తరువాత సోమవారం నాడు స్టాక్ మార్కెట్ ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు అది మార్కెట్ నిర్ణయించే అంశమన్నారు.

మరిన్ని వార్తలు