భారత్ పై ‘విదేశీ’ ప్రభావం తక్కువే..

27 Jan, 2016 00:23 IST|Sakshi
భారత్ పై ‘విదేశీ’ ప్రభావం తక్కువే..

ఎస్ అండ్ పీ విశ్లేషణ
దేశీయ డిమాండ్ కారణమని వెల్లడి
ద్రవ్యలోటు, వృద్ధి రికవరీపై మరో
ఆర్థిక సేవల దిగ్గజం డీబీఎస్ హెచ్చరిక

 న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై తక్కువగానే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం- స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) పేర్కొంది. దీనికి దేశీయంగా పటిష్టంగా ఉన్న ప్రజా వినియోగం, ప్రభుత్వ వ్యయాలు కారణమని ఎస్ అండ్ పీ ఇండియా సావరిన్ అనలిస్ట్ కిర్యాన్ క్యూరీ పేర్కొన్నారు.   కాగా ద్రవ్యలోటు, ఆర్థికాభివృద్ధి రికవరీలో వేగం ప్రస్తుత సమస్యలని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ  డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీబీఎస్) అభిప్రాయపడింది. 

ఎస్ అండ్ పీ.. విశ్లేషణాంశాలు...
భారత్ డిమాండ్ దేశీయంగా పటిష్టంగా ఉంది. దేశం నుంచి వేగంగా వెనక్కు వెళ్లిపోయే నిధులపై పూర్తిగా ఆధారపడి ఆర్థికవ్యవస్థ లేదు.  విదేశీ మారకద్రవ్యం  రాక, పోకల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1.4 శాతం వద్ద (స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే) ఉండే అవకాశం ఉంది. 2018 వరకూ ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. 

ఎగుమతులు పెరక్కపోవడం కరెంట్ అకౌంట్ లోటు 1.4 శాతం స్థాయిలోనే కొనసాగడానికి కారణం. అయితే  దేశంలోకి పసిడి దిగుమతులు పెరిగితే... కరెంట్ అకౌంట్ లోటు మరికొంత పెరిగే అవకాశం ఉంది. 2014-15లో క్యాడ్ 1.3 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) ముగిసిన ఆరు నెలల కాలంలో ఈ లోటు 1.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో క్యాడ్ 1.8 శాతంగా నమోదైంది.అదే విధంగా తన వృద్ధి నిధికి విదేశీ పొదుపుపై ఆధారపడ్డం చాలా తక్కువ. బ్యాంకింగ్‌కు దేశీయ డిపాజిట్ బేసే ప్రధానంగా అధికంగా ఉంది. భారత్ క్యాపిటల్ మార్కెట్లు వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కంపెనీల నిధుల సమీకరణకు ఇది తగిన పరిస్థితి.

 రేటింగ్ అప్‌గ్రేడ్‌పై ద్రవ్యలోటు ప్రభావం: డీబీఎస్
ప్రభుత్వ రాబడి-వ్యయాల మధ్య వ్యత్యాసమైన ద్రవ్యలోటు తీవ్రత రేటింగ్ అప్‌గ్రేడ్‌కు ఇబ్బంది కలిగించే అంశమని మరో ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీస్ (డీబీఎస్) తన తాజా నివేదికలో పేర్కొంది.   2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ప్రభుత్వ లక్ష్యం స్థూల దేశీయోత్పత్తిలో  3.5 శాతం కాగా 3.7 శాతం కన్నా అధికంగా ఉండే వీలుందని విశ్లేషించింది. దీనివల్ల రేటింగ్ అప్‌గ్రేడ్ ఆలస్యం అయ్యే వీలుందని అభిప్రాయపడింది.

అయితే కేవలం దీని ప్రాతిపదికన ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే నిర్ణయాలు ఏవీ చేపట్టబోరని కూడా విశ్లేషించింది. విదేశీ చెల్లింపుల పరిస్థితి బాగుండడం, వృద్ధి అవకాశాలు, దిగువ స్థాయి ద్రవ్యోల్బణం వంటి అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు, రేటింగ్ ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకుంటాయన్నది తమ అంచనా అని తెలిపింది. ప్రస్తుతం విదేశీ రేటింగ్ ఏజెన్సీలు  భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి స్టేబుల్ అవుట్‌లుక్‌తో బీబీబీ- గ్రేడ్‌ను ఇస్తున్నాయి.

 జంక్ స్టేటస్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ. ద్రవ్యలోటు తీవ్రతరమైతే... జంక్ స్టేటస్‌కు రేటింగ్‌ను దించుతామని ఇటీవల విదేశీ రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఫిబ్రవరి 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2016-17 బడ్జెట్‌పై ఈ సంస్థలు దృష్టి సారించాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశలో సైతం భారత్ వేగంగా అడుగులు వేయడం లేదన్నది డీ అండ్ బీ అభిప్రాయం.

మరిన్ని వార్తలు