వడ్డీ రేట్లు పెరిగితే ఇళ్ల కొనుగోలుపై ప్రభావం

11 Sep, 2023 07:55 IST|Sakshi

మెజారిటీ కొనుగోలుదారుల అభిప్రాయం

ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ ఇండియా

న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు ప్రస్తుత స్థాయి నుంచి మరింత పెరిగి 9.5 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, మెజారిటీ ఔత్సాహిక కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ ఇండియా నిర్వహించిన ‘కన్జ్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వే’తో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఈ వివరాలను అనరాక్‌ ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది.  

  • మెజారిటీ ప్రజలు మధ్యస్థ, ప్రీమియం ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ మంది మూడు పడకల ఇళ్లకు తమ ప్రాధాన్యం అని చెప్పారు.
  • అధిక ద్రవ్యోల్బణంతో 66 శాతం మంది (సర్వేలో పాల్గొన్న) ఖర్చు చేసే ఆదాయంపై ప్రభావం పడినట్టు తెలిపారు.  
  • వడ్డీ రేటు 9.5 శాతం దాటితే అది తమ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావిం చేస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 98 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం సగటు గృహ రేటు 9.15 శాతంగా ఉంది. 
  • 59 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్‌ పరిధిలోని ఫ్లాట్‌ల కోసం చూస్తున్నట్టు చెప్పారు. 
  • రూ.45 - 90 లక్షల మధ్య ఇళ్ల కొనుగోలుకు 35 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు.  
  • రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఇంటి కోసం 24 శాతం మంది చూస్తున్నారు.  
  • 48 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకు, 39 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. 
  • 2022 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో 3బీహెచ్‌కే ఇళ్లకు అనుకూలంగా ఉన్న వారు 41 శాతం నుంచి 48 శాతానికి పెరిగారు. 
  • రూ.40 లక్షల్లోపు ఇళ్లకు డిమాండ్‌ తగ్గుతోంది. 2020 మొదటి ఆరు నెలల్లో ఈ తరహా కొనుగోలు దారులు 40 శాతంగా ఉంటే, 2021 అర్ధ భాగంలో 28 శాతానికి, 2023 మొదటి ఆరు నెలల్లో 25 శాతానికి తగ్గారు.
మరిన్ని వార్తలు