మళ్లీ కొలువుల జోరు

23 Nov, 2018 08:22 IST|Sakshi

వచ్చే ఏడాది ఉద్యోగాలే ఉద్యోగాలు

ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల జోరు

ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు అధిక అవకాశాలు

ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్, 2019 వెల్లడి

న్యూఢిల్లీ: ఉద్యోగాలు వచ్చే ఏడాది జోరుగా రానున్నాయని ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్, 2019  పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఐటీ, వాహన, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగవకాశాలు ఇబ్బడిముబ్బడిగా రానున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్, హెచ్‌ఆర్‌ టెక్నాలజీ కంపెనీ పీపుల్‌ స్ట్రాంగ్, గ్లోబల్‌ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సంస్థలు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సహకారంతో ఈ నివేదికను రూపొందించాయి. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు అధిక అవకాశాలుంటాయంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని

ముఖ్యాంశాలు...
ఉద్యోగాలిచ్చే విషయమై 64 శాతం కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 20 శాతం కంపెనీలు మాత్రం 2018లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో 2019లో కూడా అన్నే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాయి.  
2017లో 7 శాతం వృద్ధి ఉన్న కొత్త ఉద్యోగాల కల్పన వచ్చే ఏడాది రెట్టింపై 15 శాతానికి చేరుతుంది. వివిధ రంగాల్లోని చిన్న, మధ్య, పెద్ద, భారీ స్థాయి కంపెనీలు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉద్యోగాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.  
2010–11 సంవత్సరంలో వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగాలొచ్చాయి. వచ్చే ఏడాది ఈ స్థాయిలో కాకపోయినా, గత 2–3 ఏళ్లతో పోల్చి తే మంచి స్థాయిలోనే ఉద్యోగాలు వస్తాయి.  
టెక్నాలజీ రంగంలో భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. డిజైన్, అనలిటిక్స్‌ ఉద్యోగాలు అధికంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి స్పెషలిస్ట్‌ టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్‌ అధికంగా ఉండనుంది.  
ఉద్యోగ కల్పన విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.  
ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అధికంగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వీరిలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) అభ్యర్థులకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు