దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు

14 Jun, 2018 13:17 IST|Sakshi

భారత సంతతికి చెందిన మహిళ ప్రపంచ ఆటో దిగ్గజ కంపెనీలో కీలక అధికారిగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన దివ్య సూర్యదేవర (39) అతిపెద్ద వాహన సంస్థ జనరల్ మోటార్స్‌ కు సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. చక్‌ స్టీవెన్స్‌ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ నుంచి దివ్య సీఎఫ్‌వోగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారని జనరల్స్‌ మోటార్స్‌ వెల్లడించింది.

గత అనేక సంవత్సరాలుగా అనేక కీలక పాత్రల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్ధిక కార్యకలాపాల్లో అంతటా దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని బార్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి జీఎంకు సీఈవోగా మేరీ బర్రా (59)కు దివ్య రిపోర్ట్ చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే ఆటో పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సీఎఫ్‌వో దివ్య , సీఈవో మేరీ రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటో కంపెనీలో సీఈవో, సీఎఫ్‌వో పదవులను మహిళలు స‍్వీకరించలేదు.

కాగా మద్రాసు యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్‌ పట్టా పొందిన దివ్య , అమెరికా హార్వర్డ్‌ యూనివర్శిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. అనంతరం ఛార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ (సీఎఫ్ఏ) ధృవీకరణ పొందారు. 2005లో జనరల్‌ మెటార్స్‌ కంపెనీలో జాయిన్‌ అయిన దివ్య జూలై , 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు