ఆరో రోజూ రూపాయి డౌన్‌

24 Apr, 2018 00:21 IST|Sakshi

మరో 36 పైసలు క్షీణత

66.48 వద్ద క్లోజింగ్‌

ముంబై: వరుసగా ఆరో సెషన్లోనూ రూపాయి మారకం విలువ క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే సోమవారం మరో 36 పైసలు తగ్గి 66.48 స్థాయికి పడిపోయింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2017 మార్చి 10 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు, క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా ఎగియడం మొదలైన అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి.

కొన్నాళ్ల క్రితం దాకా చౌక ముడిచమురు ధరలతో రూపాయి బలపడినప్పటికీ, ఇప్పుడు ఆ ర్యాలీకి అడ్డుకట్ట పడినట్లేనని ఫారెక్స్‌ ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే రిస్కును తెచ్చిపెట్టిన క్రూడ్‌ ధరల పెరుగుదల మూలంగా.. విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం డైలమాలో పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

వాణిజ్య యుద్ధ భయాలు, బాండ్‌ ఈల్డ్‌ల పెరుగుదల తదితర అంశాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్లు భారత మార్కెట్‌ నుంచి దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో క్రితం ముగింపు 66.12తో పోలిస్తే సోమవారం ఒకింత బలహీనంగా 66.20 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌ ఆ తర్వాత మరింతగా తగ్గింది.

డాలర్ల కొనుగోళ్ల ఒత్తిడితో ఇంట్రా డేలో 66.49 స్థాయికి కూడా తగ్గింది. మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్‌బీఐ కొంత జోక్యం చేసుకున్నప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చివరికి 0.54 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 66.48 వద్ద క్లోజయ్యింది.   

>
మరిన్ని వార్తలు