బ్యాంకింగ్‌ సంక్షోభంతో పెట్టుబడులకు దెబ్బే

12 Apr, 2018 01:07 IST|Sakshi

కానీ ఇది తాత్కాలికమే  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సీఈవో రమేష్‌ వ్యాఖ్య

ముంబై: దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం.. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీఈవో రమేష్‌ బవా వ్యాఖ్యానించారు. ఇది పెట్టుబడులు కొంత మందగించడానికి దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. ఏ ఒక్క సంస్థకో, వ్యక్తికో పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థ బలహీనంగా ఉన్న తరుణంలో ఇన్వెస్టర్లు కచ్చితంగా సందేహాలు లేవనెత్తుతారని రమేష్‌ తెలిపారు. అయితే, ఈ సంక్షోభం తాత్కాలికమైనదేనన్నారు. బ్యాంకింగ్‌ రంగం లోటుపాట్లను సరిదిద్దుకుని, మరింత పటిష్టమైన వ్యవస్థగా మారేందుకు ఒక అవకాశం దొరికినట్లయిందని తెలిపారు.

పీఎన్‌బీలో రూ.13,000 కోట్ల కుంభకోణం, భర్త కంపెనీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారంటూ ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు మొదలైన అంశాలన్నీ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో రమేష్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వం సహా సంబంధిత వర్గాలన్నీ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నాయని రమేష్‌ చెప్పారు. నీరవ్‌ మోదీ స్కామ్‌ బయటపడినప్పుడు దాని తాలుకూ ప్రతికూల ప్రభావాలన్నింటికీ పీఎన్‌బీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం.. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చిందన్నారు.   

మరిన్ని వార్తలు