అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐఓసీ

29 May, 2017 01:21 IST|Sakshi
అత్యంత లాభదాయక పీఎస్‌యూగా ఐఓసీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత లాభదాయక ప్రభుత్వ రంగ కంపెనీగా (పీఎస్‌యూ) పెట్రో మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఆవిర్భవించింది. టర్నోవర్‌కు సంబంధించి అతిపెద్ద కంపెనీగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐఓసీ నికరలాభం 2017 మార్చితో ముగిసిన ఏడాదిలో 70 శాతం వృద్ధితో రూ. 19,106 కోట్లకు చేరింది. దీంతో లాభాల విషయంలో చమురు ఉత్పాదక దిగ్గజం ఓఎన్‌జీసీని ఐఓసీ అధిగమించింది.

 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ రూ. 17,900 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఓఎన్‌జీసీ నికరలాభం రూ. 16,140 కోట్లుకాగా, ఐఓసీ నికరలాభం రూ. 11,242 కోట్లు మాత్రమే. అధిక రిఫైనింగ్‌ మార్జిన్లు, నిల్వల ద్వారా వచ్చిన లాభాలు, ఉత్పాదక సామర్థ్యంలో మెరుగుదల వంటి అంశాల కారణంగా అధిక వృద్ధి సాధ్యపడిందని ఐఓసీ సీఎండీ బి అశోక్‌ తెలిపారు. సహజవాయువుపై ప్రభుత్వ ధరల విధానంతో రూ. 3,000 కోట్ల నికరలాభాన్ని కోల్పోయామని ఓఎన్‌జీసీ దినేష్‌ కె సార్రాఫ్‌ పేర్కొన్నారు.

ప్రైవేటు రంగంలో రిలయన్స్‌ టాప్‌...
ప్రైవేటు రంగ కంపెనీల్లో అత్యధిక లాభదాయక కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా మూడో ఏడాది నిలబడింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ. 29,901 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. తదుపరి స్థానంలో రూ. 26,357 కోట్ల లాభంతో టీసీఎస్‌ వుంది.

మరిన్ని వార్తలు