ఐఆర్‌సీటీసీ షేరు.. దూకుడు

21 May, 2020 15:59 IST|Sakshi

మూడో రోజూ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌

లాక్‌డవున్‌లో ఈ షేరు 80 శాతం జూమ్‌

అక్టోబర్‌లో రూ. 644 వద్ద లిస్టింగ్‌

ఫిబ్రవరిలో రూ. 1995 వద్ద రికార్డ్‌ గరిష్టం 

వచ్చే నెల(జూన్‌) 1నుంచీ దేశంలోని వివిధ ప్రాంతాలకు 200 నాన్‌ఏసీ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వరుసగా ‍మూడో రోజు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు తక్కువకావడంతో రూ. 1400 వద్ద ఫ్రీజయ్యింది. జూన్‌ 1 నుంచీ ప్రారంభంకానున్న రైళ్లకు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే దాదాపు 1.5 లక్షల టికెట్లు బుక్‌అయినట్లు ఐఆర్‌సీటీసీ తాజాగా వెల్లడించింది. సుమారు 2.9 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు పొందినట్లు తెలియజేసింది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ నెల 12న న్యూఢిల్లీ నుంచి వివిధ నగరాలను కలుపుతూ 30 ఏసీ రైళ్లను ప్రవేశపెట్టగా.. ఇటీవల శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను 200 నుంచి 400కు పెంచేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఐఆర్‌సీటీసీ షేరు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తోంది.

118 శాతం ప్లస్‌
గతేడాది అక్టోబర్‌లో రూ. 644 వద్ద లిస్టయ్యాక ఐఆర్‌సీటీసీ షేరు ర్యాలీ బాటలో సాగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1995 వద్ద రికార్డ్‌ గరిష్టాన్ని అందుకుంది. ఆపై కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో పతనమైన స్టాక్‌ మార్కెట్ల బాటలో మార్చి 26న రూ. 775కు పడిపోయింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు మార్చి చివరి వారంలో లాక్‌డవున్‌ ప్రకటించాక తిరిగి కోలుకోవడం ప్రారంభించింది. ఏప్రిల్‌లో మార్కెట్ల బాటలో జోరు చూపుతూ వచ్చింది. తాజాగా రూ. 1400కు చేరుకుంది. మార్చి కనిష్టం నుంచి ఐఆర్‌సీటీసీ షేరు 80 శాతం దూసుకెళ్లింది. కాగా పబ్లిక్‌ ఇష్యూ ధర రూ. 320తో పోలిస్తే 337 శాతం జంప్‌చేసింది. లిస్టింగ్‌ ధర రూ. 644తో చూసినా 118 శాతం లాభపడటం విశేషం!

మరిన్ని వార్తలు