జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లాభం పదింతలు

9 May, 2018 00:43 IST|Sakshi

1:1 బోనస్‌ షేర్లు...

ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌  

ఆల్‌టైమ్‌ గరిష్టానికి షేర్‌ ధర...

న్యూఢిల్లీ: జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో పది రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.78 కోట్లకు పెరిగింది. డొమినో ఉత్పత్తులను అప్‌గ్రేడ్‌ చేయడం, ఆన్‌లైన్‌ అమ్మకాలు జోరుగా ఉండడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ వివరించింది.

మొత్తం ఆదాయం రూ.616 కోట్ల నుంచి రూ.793 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం డెలివరీ ఆర్డర్లలో ఆన్‌లైన్‌ అమ్మకాలు 63 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.206 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,561 కోట్ల నుంచి రూ.3,003 కోట్లకు ఎగసిందని వివరించింది.

ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇస్తామని పేర్కొంది. నికర లాభం పది రెట్లు పెరగడం,  1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను ఇవ్వడం వంటి కారణాల వల్ల బీఎస్‌ఈ ఇంట్రాడేలో జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,668 ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో చివరకు 2% నష్టంతో రూ.2,560 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు