మీ స్మార్ట్ఫోన్ పగిలిందా?

18 Jun, 2016 00:30 IST|Sakshi
మీ స్మార్ట్ఫోన్ పగిలిందా?

ఆన్‌లైన్‌లో మరమ్మతు సేవలందిస్తున్న జస్ట్‌లైక్‌న్యూ.ఇన్
ప్రస్తుతం ఫోన్లు, ట్యాబ్లెట్స్; త్వరలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీలు కూడా
ఉచిత డెలివరీ, 48 గంటల్లో రిపేరింగ్, 3 నెలల వారంటీ
ఈ ఏడాదిలో ముంబై, చెన్నై, పుణెలకు విస్తరణ
ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధుల సమీకరణ
‘సాక్షి’ స్టార్టప్ డైరీతో కో-ఫౌండర్ రామకృష్ణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా పాడైతే రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి... రిపేరు చేయించటం. రెండోది... దాన్ని వదిలేసి కొత్తది కొనుక్కోవటం. అయితే స్మార్ట్‌ఫోన్ల విషయానికొస్తే చాలామంది రిపేరుకే ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ మరీ రిపేరుకయ్యే మొత్తం ఎక్కువనుకుంటే మాత్రం... కొత్త ఫోన్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ చిక్కేంటంటే రిపేరు ఎక్కడ చేయించాలి అని!!?. ఎందుకంటే దగ్గర్లోని సాధారణ రిపేరింగ్ సెంటర్లో చేయిస్తే తక్కువ ఖర్చవుతుంది. కానీ గ్యారంటీ ఉండదు. ఇక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే గ్యారంటీ ఉంటుంది కానీ ఖర్చు మాత్రం భారీగా ఉంటుంది.

ఇదిగో... ఇలాంటి సందిగ్ధాన్నే వ్యాపారంగా చేసుకుంది ‘జస్ట్‌లైక్‌న్యూ’ బృందం!!. ఐఐటీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన నలుగురు మిత్రులు అజిత్ పాణిగ్రహి, రాహుల్ అగర్వాల్, రామకృష్ణ చావ, విధి సింఘాల్ రూ.20 లక్షల పెట్టుబడితో గతేడాది ఏప్రిల్‌లో బెంగళూరు కేంద్రంగా జస్ట్‌లైక్‌న్యూ.ఇన్‌ను ప్రారంభించారు. సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళిక గురించి కో-ఫౌండర్ రామకృష్ణ ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి ఏం చెప్పారంటే...

 20 బ్రాండ్లు.. 10 వేల రకాల రిపేర్లు..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్, ట్యాబ్లెట్స్‌ను రిపేరు చేస్తున్నాం. 80 శాతం రిపేర్లు స్క్రీన్లు పగులుతున్నవే వస్తున్నాయి. దాదాపు 20 రకాల బ్రాండ్లు, 400 రకాల మోడల్స్‌లో 10 వేల రకాల రిపేర్లున్నాయి. ఉత్పత్తి పికప్, డెలివరీ రెండూ ఉచితమే. స్టాండ్‌బై మొబైల్, 3 నెలల వారంటీ ఇవ్వటం మా ప్రత్యేకత. 48 గంటల్లో రిపేర్ చేసి ఇంటికి డెలివరీ చేస్తాం. ఆయా ఉత్పత్తులను రిపేర్ చేసేముందు 25 కోణాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన క్యూసీ రిపోర్ట్‌ను కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపిస్తాం కూడా. ప్రతి నెలా 25 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. ఈ మే నెలలో 2,000 ఉత్పత్తులను రిపేరు ఇందులో 80 శాతం స్మార్ట్‌ఫోన్లు, 20 శాతం ట్యాబ్లెట్స్ ఉన్నాయి.

 మూడేళ్లలో 15 నగరాలకు విస్తరణ..
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల నుంచి వచ్చే ఆర్డర్ల కోసం కొరియర్ సంస్థ డెల్హివరితో ఒప్పందం చేసుకున్నాం. మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా లక్ష్యం. ఈ ఏడాది ముగింపు నాటికి ముంబై, చెన్నై, పుణె నగరాలకు విస్తరించనున్నాం. సేవల విస్తరణ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీల రిపేరింగ్ సేవల్లోకి ప్రవేశిస్తాం. రెండేళ్లలో ఫ్రాంచైజీ మోడల్ లో రిటైల్ ఔట్‌లెట్‌ను కూడా ప్రారంభిస్తాం.

 రూ.3 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది టెక్నీషన్స్. ‘‘గతేడాది జూలైలో ఏంజిల్ రౌండ్‌లో భాగంగా కోటి రూపాయల నిధులను సమీకరించాం. ఇండిగో కన్సల్టింగ్ మాజీ ఎండీ వికాస్ టండన్, కాపిలరీ టెక్నాలజీస్ సీఈఓ అనీష్‌రెడ్డి, ఇన్వెస్టరు వికాస్ సాలుగూటి మా సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఈ నెలాఖరులోగా రూ.3 కోట్ల నిధులను సమీకరిస్తాం. చర్చలు పూర్తయ్యాయి. ఇందులో ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌బీసీ సెక్యూరిటీస్ ఎండీ హర్ష పప్పు, మైండ్‌ట్రీ చైర్మన్ కృష్ణ కుమార్, ఒరాకిల్ ఇండియా మాజీ ఎండీ సందీప్ మాథుర్‌లున్నారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు