టెక్‌ ​కంపెనీలు మూత

25 Jan, 2018 19:20 IST|Sakshi

మహాదాయి నదీ జలాల పంపిణి విషయంలో గోవా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కర్ణాటక వ్యాప్తంగా చేపట్టిన బంద్, ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ బంద్‌తో బెంగళూరులోని దిగ్గజ టెక్‌ కంపెనీలు మూత పడ్డాయి. ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఒక్క రోజు మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. బెంగళూరు వెలుపల, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లు గురువారం సాయంత్రం ఆరున్నర వరకు మూసివేస్తున్నట్టు తెలిపింది. మైసూర్‌, మంగళూరులో ఉన్న క్యాంపస్‌లు కూడా మూతపడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా విప్రో కూడా కర్నాటకలోని ఉద్యోగులకు గురువారం సెలవును ప్రకటించింది. నగరంలోని వైట్‌ ఫీల్డ్‌, మైనాటా టెక్ పార్కు ప్రాంతాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, కాగ్నిజెంట్‌లు కూడా ఒక్క రోజు తమ కార్యకలాపాలను మూసివేశాయి. 

ప్రజా రవాణా వ్యవస్థలు బస్సులు, టాక్సీలు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌, మార్కెట్లు అన్నీ కూడా సాయంత్రం వరకు క్లోజయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ఆర్ టీసీ బస్సు సేవలు 95 శాతం స్థంభించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్‌ బంకులు, బ్యాంకులు, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్‌ కమిటీలు మాత్రమే తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాయి. 25న బెంగుళూరు యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. గోవా- కర్నాటక మధ్య మహాదాయి నదీ జలాల పంపిణీలో వివాదంపై కూడా నేడు ఈ బంద్‌ను చేపడుతున్నారు.  కన్నడ సంఘాలు ర్యాలీలు నిర్వహించి గోవా, కేంద్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాయి.

>
మరిన్ని వార్తలు