అందరికీ పింఛను ప్రయోజనాలు దక్కాలి

10 Mar, 2017 01:49 IST|Sakshi
అందరికీ పింఛను ప్రయోజనాలు దక్కాలి

ఎన్‌పీఎస్‌లో చేరేలా అసంఘటిత రంగం వారిని ప్రోత్సహించాలి
ఈక్విటీల్లో ప్రభుత్వోద్యోగుల పెట్టుబడుల పరిమితి పెరగాలి
పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ హేమంత్‌ కాంట్రాక్టర్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : దేశీయంగా అత్యధిక శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికి పింఛను ప్రయోజనాలు దక్కేలా చర్యలు అవసరమని పెన్షన్‌ ఫండ్‌ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌ హేమంత్‌ కాంట్రాక్టర్‌ తెలిపారు. వారు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)లో చేరేలా తోడ్పడేందుకు తగు ప్రోత్సాహకాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే దిశగా ఎన్‌పీఎస్‌పై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్టర్‌ వివరించారు.

ఎన్‌పీఎస్‌కు సంబంధించి సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీగా (సీఆర్‌ఏ) కార్వీ కంప్యూషేర్‌ పూర్తి స్థాయి కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో చేరేందుకు ప్రస్తుతం 40 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, అలాగే రూ. 5,000గా ఉన్న గరిష్ట పెన్షన్‌ కూడా రూ. 10,000కు పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కాంట్రాక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం 46 లక్షల స్థాయిలో ఉన్న ఏపీవై ఏపీవై చందాదారుల సంఖ్య మార్చి ఆఖరు నాటికి 50 లక్షల స్థాయికి చేరగలదని చెప్పారు.

ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు..
ఎన్‌పీఎస్‌లోని ప్రభుత్వోద్యోగులు కూడా ఇతర చందాదారుల తరహాలో ఈక్విటీల్లో 50 శాతం దాకా ఇన్వెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంట్రాక్టర్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 శాతంగా ఉంది. ఈ అంశంపై పలు దఫాలు చర్చలు జరిగాయని, త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నామని కాంట్రాక్టర్‌ చెప్పారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు ఉన్నారని, రోజుకు 10,000 మంది చొప్పున కొత్తగా చేరుతున్నారని కాంట్రాక్టర్‌ చెప్పారు. సుమారు  రూ. 1,70,000 కోట్ల పీఎఫ్‌ఆర్‌డీఏ నిధిని ఏడు సంస్థలు నిర్వహిస్తున్నాయని వివరించారు.

ఇందులో సింహభాగం చందాదారులు ప్రభుత్వోద్యోగులే ఉంటున్నారని కాంట్రాక్టర్‌ చెప్పారు. కార్పొరేట్‌ రంగం నుంచి కూడా సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మరోవైపు చందాదారులు ఏటా 35 శాతం మేర, సబ్‌స్క్రిప్షన్‌ సుమారు 40 శాతం మేర వృద్ధి చెందుతున్నాయని కాంట్రాక్టర్‌ వివరించారు. ఎన్‌పీఎస్‌ సుమారు 10.5 శాతం మేర రాబడులు అందిస్తోందని ఆయన తెలిపారు.

సీఆర్‌ఏగా కార్వీ..: ఎన్‌పీఎస్‌ చందాదారులకి సర్వీసులు అందించేందుకు రెండో సీఆర్‌ఏగా (సీఆర్‌ఏ)గా గతేడాది లైసెన్సు దక్కించుకున్నట్లు కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి. పార్థసారథి తెలిపారు. కేవలం 34 వారాల్లో అత్యంత తక్కువ చార్జీలతో పూర్తి స్థాయిలో సర్వీసులు ప్రారంభించగలిగామని ఆయన వివరించారు.  ఎన్‌పీఎస్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా రాబోయే రోజుల్లో కార్పొరేట్లు, ప్రభుత్వ అధికారులతో భేటీ కానున్నట్లు పార్థసారథి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు