కేంద్రం ముందుకు ఎల్‌ఐసీ–ఐడీబీఐ డీల్‌

18 Jul, 2018 00:42 IST|Sakshi

ప్రభుత్వ అనుమతికి ఐడీబీఐ బ్యాంక్‌ బోర్డు వినతి

గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే 51 శాతం దాకా వాటాల విక్రయం 

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి మెజారిటీ వాటాలను విక్రయించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాటాలను 51 శాతం దాకా పెంచుకునేందుకు ఎల్‌ఐసీ చేసిన ప్రతిపాదనను బోర్డు సమావేశంలో చర్చించినట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ‘దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బోర్డు నిర్ణయం తీసుకుంది‘ అని వివరించింది.

దాదాపు రూ. 55,600 కోట్ల మేర మొండిబాకీలు, నష్టాలతో అస్తవ్యస్తంగా మారిన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీకి ప్రస్తుతం 7.98 శాతం వాటా ఉంది. దీన్ని 51 శాతానికి పెంచుకునేందుకు ఉద్దేశించిన డీల్‌ గానీ ఓకే అయిన పక్షంలో ఐడీబీఐ బ్యాంక్‌కు సుమారు రూ. 10,000–13,000 కోట్ల మేర మూలధనం సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎల్‌ఐసీ సాధారణంగా ఏ లిస్టెడ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలోనూ 15 శాతానికి మించి వాటాను కొనుగోలు చేయడానికి లేదు.

కానీ ఈ డీల్‌ విషయంలో మాత్రం కొంత వెసులుబాటు కల్పిస్తూ.. ఐడీబీఐ బ్యాంక్‌తో ఒప్పందానికి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతులిచ్చింది. ఐడీబీఐ బ్యాంక్‌ లిస్టెడ్‌ కంపెనీ అయినందున మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు