‘కోటక్‌ బ్యాంక్‌’కు  కోర్టులో చుక్కెదురు 

18 Dec, 2018 01:03 IST|Sakshi

ప్రమోటర్ల వాటాల తగ్గింపు 

గడువుపై స్టేకు నిరాకరణ

ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించిన డిసెంబర్‌ 31 డెడ్‌లైన్‌పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్‌ వోటింగ్‌ ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతానికి, 2020 మార్చి 31 నాటికి 15 శాతానికి తగ్గించుకోవాలంటూ 2018 ఆగస్టు 31న ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేఎంబీ గతవారం హైకోర్టును ఆశ్రయించింది.

గతంలో కేవలం పెయిడప్‌ క్యాపిటల్‌కి సంబంధించి మాత్రమే ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్‌ను తగ్గించుకోవాలన్న ఆర్‌బీఐ తాజాగా పెయిడప్‌ వోటింగ్‌ ఈక్విటీ క్యాపిటల్‌ కింద మార్చిందంటూ కేఎంబీ తరఫు న్యా యవాది డేరియస్‌ ఖంబాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత కోరుతూ సెప్టెంబర్‌లో రెండు సార్లు ఆర్‌బీఐకి లేఖ రాసినప్పటికీ, ఇప్పటిదాకా స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కొత్త గవర్నర్‌ తాజాగా మరోసారి పరిశీలించాలని, అందుకు వీలుగా డెడ్‌లైన్‌ను నెల రోజులు పొడిగించాలని కోరుతున్నామన్నారు. మరోవైపు, ఎప్పుడో ఆగస్టులో ఆదేశాలిస్తే.. డెడ్‌లైన్‌ దగ్గరకొస్తుండగా స్టే ఇవ్వాలంటూ కేఎంబీ న్యాయ స్థానా న్ని ఆశ్రయించిందంటూ ఆర్‌బీఐ తరఫు న్యాయవాది వెంకటేష్‌ ధోండ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు