ఆ ఏటీఎంలో రూ 2000 నోటుకు బదులు ఏమొచ్చిందంటే..

8 Aug, 2018 18:44 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : ఏటీఎం కార్డుల మోసం పశ్చిమ బెంగాల్‌లో ప్రకంపనలు రేపగా తాజాగా బెంగాల్‌లోని ఓ ఏటీఎంలో రూ 2000 నోటుకు బదులు గోధుమ రంగు పేపర్‌ రావడంతో కస్టమర్లు విస్తుపోతున్నారు. నగరానికి పొరుగునే ఉన్న హౌరా జిల్లాలోని బాలీ ప్రాంతంలోని ఓ ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఏటీఎం కార్డును స్వైప్‌ చేయగా రూ 2000 నోటుకు బదులు బ్రౌన్‌ పేపర్‌ వచ్చిందని బాధితుడు విజయ్‌ పండే వాపోయారు.

డబ్బు డ్రా చేసుకునేందుకు తాను బుధవారం ఉదయం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంకు వెళ్లి రూ 6000 విత్‌డ్రా చేశానని, అందులో రెండు రూ 2000 నోట్లు రాగా మరో నోటుకు బదులు మెషీన్‌ నుంచి గోధుమ రంగు పేపర్‌ వచ్చిందని విజయ్‌ చెప్పారు. దీనిపై తక్షణమే తాను బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించానని, ఈ ఘటనపై విచారణ చేపడతామని వారు హామీ ఇచ్చారన్నారు.

మరోవైపు ఏటీఎం కార్డుల్లో డేటా చోరీ చేస్తూ నగదు స్వాహా చేస్తున్న ఉదంతాలు కోల్‌కతాలో పెచ్చుమీరిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రుమేనియన్ల హస్తంతో ఏటీఎం కార్డుల ఫ్రాడ్‌ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి ముగ్గురు రుమేనియన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు