అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!

27 Aug, 2019 13:21 IST|Sakshi

ట్రంప్‌తో ప్రధాని మోదీ

ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధిపై దృష్టి

బియారిట్జ్‌/లండన్‌:   ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అమెరికా నుంచి దిగుమతులు మరింతగా పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఇప్పటికే 4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే దిగుమతులు తుది దశలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇరువురు భేటీ అయ్యారు. టారిఫ్‌లు, ఆర్థికాంశాలపై వివాదాలతో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో మోదీ, ట్రంప్‌ వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను, వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే తెలిపారు.

వచ్చే నెల అమెరికాలో మోదీ పర్యటనకు ముందే ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చించాలని నేతలిద్దరూ నిర్ణయించినట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ప్రధాన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ సందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నట్లు గోఖలే చెప్పారు. అలాగే మోదీ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక ఇంధన సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను కూడా అవసరమైతే హ్యూస్టన్‌కు పంపేందుకు సిద్ధమని చెప్పారు.  ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సెప్టెంబర్‌లో అమెరికా వెడుతున్న మోదీ.. 22న హ్యూస్టన్‌లో  ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గోనున్నారు. అలాగే, అమెరికాలోని టాప్‌ ఇంధన కంపెనీల సీఈవోలతో కూడా భేటీ కానున్నారు. అక్కడ ఇంధన రంగంలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు