ముకేశ్‌ అంబానీకి  మరో ఐదేళ్లు అవకాశం

9 Jun, 2018 00:50 IST|Sakshi

వాటాదారుల అనుమతి కోరిన ఆర్‌ఐఎల్‌  

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి మరో ఐదేళ్ల పాటు చైర్మన్,  ఎండీగా అవకాశం ఇచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) వాటాదారుల అనుమతి కోరింది. 41వ వార్షిక వాటాదారుల సమావేశానికి సంబంధించి నోటీసు పంపింది. ఈ సమావేశం జూలై 5న ముంబైలో జరగనుంది. ఈ సందర్భంగా ముకేశ్‌ అంబానీని మరోసారి చైర్మన్, ఎండీగా ఎన్నుకునే తీర్మానాన్ని వాటాదారుల ముందు ఉంచుతుంది. ప్రస్తుత పదవీ కాలం 2019 ఏప్రిల్‌ 19తో ముగుస్తుంది. వాటాదారులు తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ తదుపరి మరో ఐదేళ్ల పాటు ఆయనే కంపెనీ సారథిగా కొనసాగుతారు.

61 ఏళ్ల ముకేశ్‌ అంబానీ 1977 నుంచి ఆర్‌ఐఎల్‌ బోర్డులో ఉన్నారు. 2002 జూలై 6న తండ్రి ధీరూబాయి అంబానీ మరణానంతరం ముకేశ్‌ ఆర్‌ఐఎల్‌కు చైర్మన్‌ అయ్యారు. వాటాదారులకు పంపిన నోటీసులోనే ముకేశ్‌ అంబానీకి చెల్లించే వేతన, భత్యాల వివరాలను కూడా కంపెనీ పేర్కొంది. ఏటా రూ.4.17 కోట్ల వేతనం, రూ.59 లక్షల ప్రయోజనాలు, అలవెన్స్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది. లాభాల ఆధారిత బోనస్‌ అందుకునే అర్హత కూడా ఉందని పేర్కొంది. వ్యాపార పర్యటనల సమయాల్లో ముకేశ్, ఆయన సతీమణి, సహాయకుల ప్రయాణ ఖర్చులు, వసతి, ఆయన కుటుంబానికి భద్రత ఖర్చులను చెల్లించనున్నట్టు తెలిపింది. 

మరిన్ని వార్తలు