Threat Emails To Mukesh Ambani: అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే! ఏం జరిగిందంటే..

4 Nov, 2023 16:21 IST|Sakshi

Threat emails to Mukesh Ambani: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన వ్యక్తిని ముంబై గాందేవి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

గత వారంలో ముఖేష్‌ అంబానీకి ఐదు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయని, కోట్ల కొద్దీ డబ్బు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. “ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా తెలుస్తోంది. మా దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

‘బిజినెస్‌మేన్‌’ సినిమాలో మాదిరిగా..
2012లో వచ్చిన మహేష్‌బాబు సినిమా ‘బిజినెస్‌మేన్‌’ను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీని ఈమెయిల్స్‌ ద్వారా రూ.కోట్లు డిమాండ్‌ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు.

మా దగ్గర మంచి షూటర్లున్నారు..
గత అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్‌ అంబానీకి మొదటి బెదింపు ఈమెయిల్‌ వచ్చింది. “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారు” అని అందులో పేర్కొన్నారు.

తర్వాత మరొక ఈమెయిల్ వచ్చింది. అందులో మొదటి ఈమెయిల్‌ స్పందించనందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. "డిమాండ్లు నెరవేర్చకపోతే, డెత్ వారెంట్ (అంబానీకి) జారీ అవుతుంది" అని బెదిరించారు. 

అక్టోబర్‌ 31న అంబానీ అధికారిక ఈమెయిల్ ఐడీకి మూడో ఈమెయిల్‌ పంపించిన నిందితుడు ఈ సారి రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు. నవంబర్‌ 1, 2 వ తేదీల్లో కూడా అలాంటి మరో రెండు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈమెయిల్స్‌లోని ఐపీ అడ్రస్‌లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు