పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

10 Mar, 2017 07:12 IST|Sakshi
పసిడిపై రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు ఆర్‌బీఐ ఆదేశాలు
ఇప్పటి వరకూ రూ.లక్షగా ఉన్న పరిమితి


ముంబై: పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం రూ.25,000 దాటితే చెక్కురూపంలోనే మంజూరు చేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం.  అంటే ఇకపై పసిడి తనఖాలపై రుణం రూ.25,000 వరకే నగదు రూపంలో ఎన్‌బీఎఫ్‌సీల వద్ద లభిస్తాయన్నమాట. ఇంతక్రితం ఈ పరిమితి రూ.లక్షగా ఉండేది.

ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను అనుసరించి ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.  ఆర్థిక లావాదేవీలు అన్నీ నగదు రహితంగా జరగాలని కోరుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి పదేపదే వెలువడుతున్న ప్రకటనల నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.