ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు మరింత చేయూత

27 Dec, 2018 01:25 IST|Sakshi

ప్రధానిని కోరిన పరిశ్రమ ప్రతినిధులు

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (హెచ్‌ఎఫ్‌సీ) ప్రతినిధులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఈ రంగాల పునరుద్ధరణకు సూచనలు చేశారు. అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వరుసగా రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో, అది ఆర్థిక సేవల మార్కెట్లో ద్రవ్య లభ్యత సమస్యకు దారితీసిన విషయం తెలిసిందే. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధానికి తెలియజేసినట్టు అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బీకే గోయంకా చెప్పారు. ‘‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షో భం తర్వాత ప్రభుత్వం పలు సానుకూల చర్యలను తీసుకుంది. అయితే, ఇవి సరిపోవని సంకేతమిస్తున్నాం.

అందుకే దీన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు. పరిశ్రమల ఆందోళనల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా అతి ముఖ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలను ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణకు అనుమతించాలని, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశం హెచ్‌ఎఫ్‌సీలకు కల్పించాలని కంపెనీల ప్రతినిధులు ప్రధానిని కోరారు. మొత్తం రుణాల్లో వ్యక్తుల గృహ రుణాల వాటా 50%కి మించి ఉండాలన్న నిబంధనకు 2020 డిసెం బర్‌ వరకు గడువు ఇవ్వాలని కూడా కోరారు. ఇండియాబుల్స్‌ గ్రూపు చైర్మన్‌ సమీర్‌ గెహ్లాట్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ కపిల్‌ వాద్వాన్, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ ఎండీ దినంత్‌ దుబాసీ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు