27 Dec, 2018 01:24 IST|Sakshi

జీవన కాలమ్‌

ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్‌ గారు హనుమంతుడు దళితుడని వాక్రుచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయ త్నం వారు చేశారు. వారి మంత్రి మండలిలోని లక్ష్మీనారాయణ చౌదరిగారు శాసనసభలో హను మంతుడు జాట్‌ అని సెలవి చ్చారు. వారి దూరదృష్టి అనన్యసామాన్యం. ఈ విధంగా రాజస్తాన్‌లో ఒక వర్గం నిస్పృహను, నినాదాలను ఆయన ఒక్క వేటుతో నేలమట్టం చేసేశారు.

ఈ లోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల్‌ నవాబ్‌ గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెర లేవ దీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజహితానికి తెరలేపే అపూర్వ మైన పరిశీలన. ఈ లెక్కన కిష్కింధలో వానర సైన్య మంతా ముస్లింలేనా– సుగ్రీవ్‌ అహమ్మద్, వాలి అహమ్మ ద్‌ల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విష యాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్‌ కనీసం కిష్కింధ కాండనుంచీ రామాయణాన్ని తిరిగి రాయాలని నాకని పిస్తుంది.

నన్నడిగితే ఈ బుక్కాల్‌ నవాబు గారిని హిందు వులు పూలదండలు వేసి దేశమంతా ఊరేగించాలి. హను మంత్‌ ఖాన్‌ సాహెబ్‌ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక– ఈ దేశంలో తర తరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిర సమస్య తేలికగా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకూ ప్రార్థనా స్థలం కనుక.

నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతం త్య్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికీ ఈ దేశంలో దేశ స్వాతంత్య్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్‌ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణెం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలూ ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణెమిది.

అర్దణా నాణెం. అంటే రూపాయిలో 32వ వంతు. ఈ నాణెం మీద హను మంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం (210 సంవ త్సరాల కిందటిమాట అని మరిచిపోవద్దు) ఇంకా నయం హనుమంతుడు లంక్‌షైర్‌లోనో, బర్మింగ్‌హామ్‌లోనో పుట్టిన హనుమంత్‌ హెన్రీ అనో, వయస్సొచ్చాక ఎగిరి కిష్కింధ చేరాడనో అనలేదు. అయినా నిమ్మకాయలమ్ము కునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం– అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే బ్రౌన్, కాటన్, మెకంజీ వంటి మహనీయులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారుల సంస్కృతి మనది. ఉదాహరణకి– విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ.

ఏదీ? మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలాంటి నాణేన్ని విడుదల చేయమనండి. వేలంకన్ని చర్చి బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. జుమ్మా మసీదు బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పనిలేదు. మనకి మతం అడ్డువస్తుంది. మతం సామరస్యానికి పట్టుగొ మ్మగా నిలవాల్సిందిపోయి– పక్కవాడి మతాన్ని దుయ్య పట్టేదిగా తయారయింది.

కాగా, ఒక వర్గానికి జరిపే ఉపకారం, క్రమంగా షరతై, ఓట్లయి, హక్కై– మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వాతంత్య్ర దేశం. ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్క రించుకునే పెద్ద మనస్సు లేని దేశం.

ఈ నేపథ్యంలో మన బుక్కాల్‌ నవాబుగారి ప్రతి పాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్‌ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుంతుడు ఒక ‘ఆర్యుడు’ అన్నారు. నంద కిషోర్‌ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షులు హనుమంతుడు ఒక గిరిజనుడన్నారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులు దీపక్‌ సింగ్‌ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవ లసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు.

ఏతావాతా మనకి అర్థం అవుతున్న విషయం ఏమి టంటే– ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకిగానీ, తమ వర్గానికో, మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యా నికిగానీ రామాయణంలో ‘హనుమంతుడి’ పాత్ర ఒక్కటే పెట్టుబడి కావటం– అదిన్నీ 210 సంవత్సరాలకు పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదనలు చేసినవారు కేవలం పార్టీ సభ్యులు కారు. శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చెయ్యడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల ‘వెర్రితలల’ విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం.


వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు

మరిన్ని వార్తలు