సంపన్న దేశాల్లో అగ్రగామిగా భారత్‌

31 Oct, 2018 00:24 IST|Sakshi

నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం

మొబికామ్‌ సదస్సులో అంబానీ

న్యూఢిల్లీ: తొలి మూడు పారిశ్రామిక విప్లవాల విషయంలో వెనుకబడినప్పటికీ.. టెక్నాలజీని విరివిగా ఉపయోగించే భారీ యువ జనాభా ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించే స్థాయిలో భారత్‌ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. అత్యంత సంపన్నమైన టాప్‌ 3 దేశాల జాబితాలో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. 24వ మొబికామ్‌ సదస్సులో  అంబానీ ఈ విషయాలు చెప్పారు.

దేశీయంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా డిజిటల్‌ విప్లవం చోటు చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ‘1990లలో రిలయన్స్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నప్పుడు దేశ జీడీపీ 350 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు ఇది 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరువగా ఉంది. భారత్‌ ఈ స్థాయికి చేరుకోగలదని ఊహించినవారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రస్తుతం టాప్‌ 3 సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో ముందుకు దూసుకుపోతోంది‘ అని అంబానీ చెప్పారు.  

  ప్రస్తుతం అత్యధిక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్‌ కేంద్రంగా భారత్‌ మూడో స్థానంలో ఉందని తెలిపారు. వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పపంచానికి భారత్‌ సారథ్యం వహించగలదని, తదుపరి ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించగలదని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు