-

ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు!

28 Nov, 2023 15:50 IST|Sakshi

ఆసియాలోనే సంపన్నుడైన ముఖేష్ అంబానీ రిలయన్స్‌ గ్రూప్‌ను విస్తరిస్తూ మార్కెట్‌ను ఏలుతున్నారు. నెమ్మదిగా ఆయన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగిస్తున్నారు. అందులో ఇషాఅంబానీ తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందుతోంది. ఇషా రిలయన్స్‌ రిటైల్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కంపెనీని దశల వారీగా విస్తరిస్తూ ప్రస్తుతం రూ.8 లక్షల కోట్ల కంపెనీగా మలిచింది. కంపెనీ అనేక ప్రఖ్యాత విదేశీ బ్రాండ్లను దేశీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దాదాపు 7వేల టౌన్‌ల్లో సుమారు 18వేల స్టోర్లతో దూసుకెళ్తున్న రిలయన్స్‌ రిటైల్‌ అభివృద్ధి వెనుక ఇషా అంబానీతోపాటు కంపెనీలో ఉన్నత​ స్థానంలోని వ్యక్తుల కృషి ఎంతో ఉందని ఆమె తెలిపారు. 

ఇప్పటికే బర్‌బెరీ, స్టీవ్‌ మాడెన్‌, అర్మానీ, బాలెన్సియాగా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో రిలయన్స్ జతకట్టడానికి ఇషా అంబానీ ఎంతో కృషి చేసింది. రోజూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కంపెనీకి సారథిగా ఉండడం కొంత కష్టమైన పని. అయితే కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే కొందరు విశ్వసనీయ సహాయకులను ఆమె నియమించుకున్నారు. 

రిలయన్స్ రిటైల్ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌, గ్రాసరీ, ఫార్మా రిటైల్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీ తన మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించింది. 2020లో అమెరికా పెట్టుబడి సంస్థ సిల్వర్‌లేక్‌ 1.75 శాతం వాటాను రూ.7500 కోట్లకు కొనుగోలు చేసింది. కంపెనీలో కేకేఆర్‌ సంస్థ 1.28 శాతం వాటా(రూ.5500 కోట్లు) కలిగి ఉంది. 2021లో ఫ్యూచర్‌గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ గత సంవత్సరం ఏకంగా 3,300 స్టోర్లను ప్రారంభించింది. 78 కోట్ల మంది ఈ స్టోర్లను కస్టమర్లు సందర్శిస్తుండగా.. 100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు సందర్శిస్తున్న టాప్-10 రిటైల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

ఇదీ చదవండి: 10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!

రిలయన్స్ రిటైల్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా రూ.82,646 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం దేశంలో 7000 టౌన్‌ల్లో మెుత్తం 18000 రిటైల్ స్టోర్లను కలిగి ఉంది.  కంపెనీలో 2.45 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇషా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు