ఇక అన్ని రాయితీలు బ్యాంకుల్లోనే

20 Jan, 2015 02:05 IST|Sakshi
ఇక అన్ని రాయితీలు బ్యాంకుల్లోనే

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఇకపై అన్ని రాయితీలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. చెన్నైలో సోమవారం జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయితీల దుర్వినియోగం అరికట్టి, లబ్ధిదారుకు పూర్తిస్థాయిలో మేలు జరిగేందుకే రాయితీలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

చమురు, వ్యవసాయ ప్రాధాన్యతలపై కేంద్రం పెద్ద ఎత్తున రాయితీలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా బ్యాంకు ఖాతాల్లోకి అన్ని రాయితీల్ని చెల్లించే విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడే విధంగా రూపొందించిన సరుకు, సేవాపన్ను విధింపును రాష్ట్ర ప్రభుత్వాలన్నీ స్వాగతిస్తున్నాయని చెప్పారు.

ఈ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఒక్కపైసా కూడా నష్టం జరగదని తెలిపారు. రైతుల భూముల ధరలు పెరగడం, నిరుద్యోగులకు ఉపాధి కలగడం వంటి మంచి జరగడం వల్ల భూసేకరణ బిల్లుపై ఆపోహలు వీడిపోయాయన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఆర్థికంగా చితికిపోగా, బీజేపీ అధికారంలోకి వచ్చాకే ప్రగతి పథం వైపు పరుగులు పెడుతోందన్నారు. విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడమే దేశ ప్రగతికి తార్కాణమని చెప్పారు. దేశ ప్రగతిలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంచేందుకే నీతి ఆయోగ్ ప్రవేశపెట్టామన్నారు.

మరిన్ని వార్తలు