డిస్కౌంట్లు కావాలా.. గ్రాబ్ఆన్

14 May, 2016 00:39 IST|Sakshi
డిస్కౌంట్లు కావాలా.. గ్రాబ్ఆన్

ఏటా రూ.100 కోట్ల కస్టమర్ల డబ్బు ఆదా
ఈ-కామర్స్ కంపెనీలకు రూ.500 కోట్ల వ్యాపారం దీని ద్వారానే..
ఈ ఏడాది 10-15 మిలియన్ డాలర్ల సమీకరణ
ఆ తర్వాతే ఆఫ్‌లైన్ స్టోర్లకూ గ్రాబ్‌ఆన్ కూపన్లు
గ్రాబ్ఆన్ ఫౌండర్, సీఈఓ అశోక్ రెడ్డి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :వారాంతంలో సినిమాకెళ్లాలి.. థియేటర్‌కి చేరుకోవడానికి ఓ క్యాబ్ కావాలి! తిరిగొస్తూ రెస్టారెంట్‌లో భోజనం చేయాలి.. కానీ, అన్నీ తక్కువ ధరలోనే సుమీ!! ఆన్‌లైన్‌లో వెతికితే సినిమాకో సైట్.. క్యాబ్‌కి ఇంకో సైట్.. రెస్టారెంట్‌కు మరో సైట్.. ఇలా వేటికవే వేర్వేరుగా రాయితీలందిస్తున్నాయ్. సినిమా టికెట్ల మొదలు క్యాబ్, రెస్టారెంట్లు.. ఇలా ఒకటేమిటి దాదాపు 60 విభాగాల్లో డిస్కౌట్లు, ఆఫర్లు, కూపన్లందించే సంస్థ దొరికితే.. ఇంకేముంది!! అచ్చం ఇదే వ్యాపార సూత్రంగా మలుచుకొని సేవలందిస్తుంది గ్రాబ్‌ఆన్.ఇన్! మరిన్ని వివరాలు గ్రాబ్‌ఆన్ ఫౌండర్, సీఈఓ అశోక్ రెడ్డి వరీధి రెడ్డి మాటల్లోనే..

 గ్రాబ్‌ఆన్ ఎలా ప్రారంభమైందో చెప్పడానికంటే ముందు నా గురించి కొంత చెప్పాలి. మొదట్లో మాది ల్యాండ్‌మార్క్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ. ఇందులో ఇన్‌స్పైర్ ల్యాబ్స్ పేరిట కొత్త ఆలోచనతో ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించేవాళ్లం. కొంత పెట్టుబడితో వారి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చేవాళ్లం. అలా ఓ ఏడాది భాను రాజు, స్పందన్ జగ్గుమంత్రి, సీతారాం కుమార్, హరిబాబు, నాగేంద్ర 5 గురు కలిసి ‘గ్రాబ్‌ఆన్’ గురించి చెప్పారు. ఆలోచన కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. అప్పటివరకున్న కూపన్ సంస్థలు టెక్నాలజీని అంతగా ఉపయోగించట్లేదని తెలుసుకొని.. ఈ-కామర్స్ వృద్ధిని, డిస్కౌంట్ల అవసరాన్ని ముందుగానే అంచనా వేసుకొని వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలనుకున్నా. టెక్నాలజీ అభివృద్ధి, కొంత మంది ఉద్యోగుల నియామకం తదితరాలకు రూ.10 లక్షల పెట్టుబడితో 2013 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కేంద్రంగా గ్రాబ్‌ఆన్.ఇన్ ప్రారంభమైంది.

 60 విభాగాలు.. 1,700 సంస్థలు
ఆన్‌లైన్‌లో కస్టమర్లకు కూపన్లు అందించి అటు ఈ-కామర్స్ కంపెనీలకు ప్రమోషన్ చేయడమే గ్రాబ్‌ఆన్ పని. మా సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ 60కి పైగా విభాగాల్లో కూపన్లను వినియోగించుకోవచ్చు. పేటీఎం, జబాంగ్, ఉబర్, ఫ్రీచార్జ్, స్నాప్‌డీల్, స్విగ్గీ, ఓలా, బిగ్ బాస్కెట్ వంటి సుమారు 1,700 ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. పేటీఎం, ఉబర్ వంటి కొన్ని కంపెనీలకు ఎక్స్‌క్లూజివ్ కూపన్లూ అందిస్తున్నాం. అంటే ఇతర కూపన్స్ కంటే వీటి కస్టమర్లకు ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయన్నమాట. మా ద్వారా కొనుగోలు జరిగే ప్రతీ ఉత్పత్తిపై (1-20% వరకూ) కొంత కమీషన్ ఉంటుంది.

 ఏటా రూ.100 కోట్లు ఆదా..: ప్రస్తుతం రోజుకు లక్ష మంది.. నెలకు 2.5 మిలియన్ల మంది మా కూపన్లను వాడుకుంటున్నారు. వీరిలో 47 శాతం మంది రిపీటెడ్ కస్టమర్లే. మిగతావారు కొత్త కస్టమర్లు. ప్రతి నెలా 10-15% వరకు పెరుగుతున్నారు కూడా. 2017 ముగింపులోగా 25 మిలియన్ యూజర్లకు చేరుకోవాలని లక్ష్యం. గతేడాది గ్రాబ్‌ఆన్ కూపన్ల వినియోగం ద్వారా కస్టమర్లకు ఆదా అయిన సొమ్ము విలువ అక్షరాల రూ.100 కోట్లు. మా సంస్థ ద్వారా ఈ-కామర్స్ సంస్థలకు జరిగిన వ్యాపారం రూ.500 కోట్ల వరకుంది. ఈ ఏడాది 1,200 కోట్ల వ్యాపారానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

 రూ.6 కోట్ల టర్నోవర్..
ప్రస్తుతం మా సంస్థలో 150 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటీవలే 2,50,000 డాలర్ల పెట్టుబడులతో అమెరికాకు చెందిన ఓ హెచ్‌ఎన్‌ఐ ముందుకొచ్చారు. కానీ, మా బ్రాండ్‌ను ఇచ్చేయమన్నారు. దీంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. మళ్లీ నిధుల సమీకరణకు వెళ్తున్నాం. టెక్నాలజీ అభివృద్ధి, సేవల విస్తరణ, మరికొంత మంది ఉద్యోగుల నియామకం వంటి వాటి కోసం10-15 మిలియన్ డాలర్ల నిధులవసరమవుతాయి. ఫండింగ్ తర్వాతే ఆఫ్‌లైన్ స్టోర్లకూ మా కూపన్లను అందించాలని నిర్ణయించాం. ప్రధాన మెట్రో నగరాల్లోని స్టోర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం.

 ‘సాక్షి’ ద్వారా ప్రత్యేక ఆఫర్..
దేశంలోనే అతిపెద్ద కూపన్స్, డీల్స్ కంపెనీగా గ్రాబ్‌ఆన్ అవతరించడానికి కారణం.. స్ట్రాటర్జీక్ అలయెన్స్ విత్ కస్టమర్స్. ఎలాగంటే.. సాక్షి, ఫైబర్ నెట్ వంటి సంస్థలతో పాటూ పలు విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఏమవుతుందంటే.. ఉదాహరణకు సాక్షి.కామ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే అడ్వటైజ్‌మెంట్‌లలో గ్రాబ్‌ఆన్ కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేయగానే నేరుగా గ్రాబ్‌ఆన్ వెబ్‌సైట్ లోంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే వీలుంటుంది. దీంతో సాధారణ కూపన్లు, ఎక్స్‌క్లూజివ్ కూపన్ల కంటే వీరికి ఇంకాస్త ఎక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయన్నమాట.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

మరిన్ని వార్తలు