రూ. 83 లకే విమాన టికెట్: అదిరిపోయే ట్విస్ట్‌ ఏమిటంటే..!

13 Nov, 2023 16:21 IST|Sakshi

పండుగల సందర్భంగా చాలా విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులో  ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక డాలరు కంటే (రూ. 83) తక్కువకే  దిగి రావడం వైరల్‌గా మారింది. అదీ  కొన్ని ఖరీదైన  రూట్లలో కూడా కేవలం  రూ. 114లకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడంతో  జనం ఎగబడ్డారు. తొలుత ఫేక్‌ వెబ్‌సైట్‌ అని కొంత తటపటాయించారు. కానీ అది ప్రముఖ  వెబ్‌సైట్‌ అని ధృవీకరించుకున్న తరువాత టికెట్లను భారీగా కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు డాలరు  కంటే తక్కువ ధరకే విమాన టికెట్లు అంటూ బుకింగ్‌  స్క్రీన్ షాట్‌లతో  సోషల్ మీడియాలో హోరెత్తించారు. దీంతో  విషయం తెలిసిన సంస్థ రంగంలోకి  దిగింది.
 
ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని సదరన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో విమాన ఛార్జీలు ఉన్నదానికంటే తక్కువకే దర్శనమిచ్చాయి. గాంగ్జూ ప్రావిన్స్‌ కేంద్రంగా పనిచేసే చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌‌కు చెందిన వెబ్‌సైట్‌లో దాదాపు 2 గంటలపాటు టెక్నికల్ సమస్య ఏర్పడింది. ఈ లోపం కారణంగా చెంగ్డూ నుండి షాంఘై వంటి కొన్ని రూట్‌లు 1.37 డాలర్లకంటే (రూ. 114) తక్కువ ధరల్ని ప్రదర్శించాయి. ఎయిర్‌లైన్ యాప్, వివిధ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలోకూడాఇలానే కనిపించింది. చైనాలో అత్యంత రద్దీగా ఉండే ఆన్‌లైన్ షాపింగ్ కాలం కావడంతో కొనుగోలు దారులు క్యూ కట్టారు. 

అయినా చెల్లుతాయి
అసాధారణ రద్దీతోపాటు ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో రంగంలోకి దిగిన సంస్థ  టెక్నికల్‌ సమస్యను ఆలస్యంగా గుర్తించింది. ట్విస్ట్‌ ఏంటంటే ధరలతో సంబంధం లేకుండా, సాంకేతిక లోపం సమయంలో కొనుగోలు చేసిన అన్ని టిక్కెట్‌లూ చెల్లుతాయని ప్రయాణికులకు హామీ ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ మేరకు  చైనా సదరన్ ఎయిర్‌లైన్స్  అధికారిక  వీబో సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది. అయితే  గతంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌లో కూడా  ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ తప్పుగా ప్రాసెస్‌ అయిన టికెట్లు చెల్లవని, సంబంధిత టికెట్ల సొమ్మును వాపసు ఇస్తామని  ప్రకటించింది. 

మరిన్ని వార్తలు