ఆరో రోజూ లాభాలు

19 Mar, 2019 00:42 IST|Sakshi

తగ్గిన వాణిజ్యలోటు 

పుంజుకున్న రూపాయి 

కొనసాగుతున్న విదేశీ నిధుల వరద 

71 పాయింట్ల లాభంతో 38,095కు సెన్సెక్స్‌

35 పాయింట్ల లాభంతో 11,462కు నిఫ్టీ

స్టాక్‌ సూచీల లాభాల పరుగు కొనసాగుతోంది. వాణిజ్య లోటు తగ్గడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. ట్రేడింగ్‌ మధ్యలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్పలాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 71 పాయింట్ల లాభంతో 38,095 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 11,462 పాయింట్ల వద్ద ముగిశాయి. 

418 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
ఎగుమతులు 2.4 శాతం పెరగడం, పుత్తడి, పెట్రోలియమ్‌ ఉత్పత్తుల దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు 960 కోట్ల డాలర్లకు తగ్గింది. ఇక ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 54 పైసలు పుంజుకొని 68.56కు ఎగసింది. ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం అమెరికాలో వెలువడిన ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు తగ్గాయి. ఫలితంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు  లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  మధ్యాహ్నం నుంచి చివరి అరగంట వరకూ స్వల్ప శ్రేణిలో సెన్సెక్స్,నిఫ్టీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. చివరి అరగంటలో కోలుకొని లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 72 పాయింట్లు తగ్గగా, మరో దశలో 346 పాయింట్ల మేర పెరిగింది. మొత్తం మీద రోజంతా   418 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 

రియల్టీ షేర్ల జోరు...
భారత దేశం తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (రీట్‌) ఇష్యూలో భాగంగా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ శుక్రవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,743 కోట్లు సమీకరించింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ షేర్లు జోరుగా పెరిగాయి. ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్, ఓబెరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రొపర్టీస్, పార్శ్వనాధ్‌ షేర్లు 3–16 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. 

►బజాజ్‌ ఫైనాన్స్‌ 2.8 శాతం లాభంతో రూ.2,926 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. ఈ నెలలో ఇప్పటివరకూ ఈ షేర్‌ 10 శాతం లాభపడింది.
►బ్యాంక్‌ నిఫ్టీ జీవిత కాల రికార్డ్‌లు సోమవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 29,812 పాయింట్లను తాకిన బ్యాంక్‌ నిఫ్టీ చివరకు 214 పాయింట్ల లాభంతో 29,596 పాయింట్ల వద్ద ముగిసింది. 
​​​​​​​►పీవీఆర్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,699ను తాకింది. చివరకు 3.6 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది. ఒక నెల కాలంలో ఈ షేర్‌ 17 శాతం ఎగసింది. ఈ షేరుతో పాటు మరికొన్ని షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌ఆర్‌ఎఫ్, యూపీఎల్, అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. 
​​​​​​​►దాదాపు 50కి పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. 
​​​​​​​► ఆరు రోజుల ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4.14 లక్షల కోట్లు పెరిగి రూ.1,48,81,141 కోట్లకు పెరిగింది.  

>
మరిన్ని వార్తలు