నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

2 May, 2016 11:04 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 190.86 పాయింట్లు పడిపోతూ 25,415.76 వద్ద నమోదవుతుండగా.. నిఫ్టీ 50.05 పాయింట్ల నష్టంతో 7,799 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్, హీరో మోటో కార్పొ, బీపీసీఎల్, ఎస్ బ్యాంకు లాభాల్లో నడుస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంకు, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, బీహెచ్ఈఎల్, విప్రోలు నష్టాలను చవిచూస్తున్నాయి.
 
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించిన నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలతో నేటి ట్రేడింగ్ లో ఈ బ్యాంకు షేర్లు 4శాతం మేర పడిపోతున్నాయి. మరోవైపు మార్కెట్లో పసిడి, వెండి పుంజుకుంటున్నాయి. పసిడి 14 పాయింట్ల లాభంతో 30,280 వద్ద, వెండి 109 పాయిట్ల లాభంతో 41,675 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.33గా ఉంది. ఆసియా మార్కెట్లు సైతం సోమవారం ట్రేడింగ్ లో నష్టాలనే నమోదుచేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు