నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టు షాక్‌

26 Apr, 2019 15:40 IST|Sakshi

లండన్‌ : పరారీలో ఉన్న డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రూ 13,000 కోట్ల పీఎన్‌బీ స్కామ్‌, మనీల్యాండరింగ్‌ కేసుల్లో నిందితుడైన నీరవ్‌ మోదీ అప్పగింత ప్రక్రియపై భారత్‌ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణను మే 24కు లండన్‌ కోర్టు వాయిదా వేసింది. గత నెలలో నీరవ్‌ మోదీ అరెస్టయిన తర్వాత లండన్‌లోని వ్యాండ్స్‌వర్త్‌ జైలులో గడుపుతున్నారు.

కాగా గత నెలలో విచారణ సందర్భంగా నీరవ్‌ మోదీ సాక్షులను బెదిరించినట్టు, స్కామ్‌కు సంబంధించి కీలక ఆధారాలున్న సర్వర్‌, మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైంది. విజయ్‌ మాల్యా అప్పగింత కేసు తరహాలోనే నీరవ్‌ న్యాయవాదులు సైతం నీరవ్‌పై ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు బ్రిటన్‌లోనే తమ కేసు విచారణ సక్రమంగా సాగుతుందని కోర్టుకు నివేదించారు. పీఎన్‌బీ స్కామ్‌ వెలుగుచూడక ముందు గత ఏడాది జనవరిలో నీరవ్‌ మోదీ తన కుటుంబంతో కలిసి భారత్‌ను విడిచివెళ్లారు.

మరిన్ని వార్తలు