నష్టాలొచ్చినా కాగితం ధర పెంచలేం..

16 Jul, 2015 01:26 IST|Sakshi
నష్టాలొచ్చినా కాగితం ధర పెంచలేం..

దిగుమతులే ఇందుకు కారణం
- సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరాం
- పేపర్‌టెక్ సదస్సులో వక్తలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
కాగితం పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. ముడిపదార్థాల వ్యయం రెట్టింపు అయింది. అటు కలప కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఇక్కడి కంపెనీలు పేపర్ ధర పెంచాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. దిగుమతులపై ఎటువంటి పన్నులేదు. దీనికితోడు 5-7 శాతం ధర తక్కువ. ఇంకేముంది ఇక్కడి వ్యాపారులు పేపర్‌ను ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకుంటున్నారు.

మొత్తం వినియోగంలో దిగుమతైన పేపర్ వాటా 20%. ఈ పరిస్థితుల్లో నష్టాలొచ్చినా ప్రస్తుతం ధర పెంచలేకపోతున్నామని ఇండియన్ పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఐటీసీ పేపర్‌బోర్డ్స్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్ తెలిపారు. బుధవారం ప్రారంభమైన పేపర్‌టెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దిగుమతులపై సుం కం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.
 
పరిశ్రమకు 20 లక్షల ఎకరాలు..

కలపను ఇప్పటికీ దేశీయ పేపర్ పరిశ్రమ దిగుమతి చేసుకుంటోంది. దీనిని నివారించాలంటే అదనంగా 20 లక్షల ఎకరాల్లో కలప పండించాల్సిందేనని శేషసాయి పేపర్ చైర్మన్ ఎన్.గోపాలరత్నం వెల్లడించారు. అవసరమైన భూముల కోసం అటవీ చట్టాలను సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా ఉంది అని తెలిపారు. పట్టణీకరణ మూలంగా పేపర్ వినియోగం పెరుగుతోందని, ఈ ఏడాది వృద్ధి రేటు 5-6 శాతం ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల కారణంగా ముద్రణ కాగితం వాడకం నాలుగేళ్లలో 20 శాతం తగ్గిందని పేపర్‌టెక్ 2015 చైర్మన్ కేఎస్ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. కాగా, భారతీయ ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 80 శాతం మాత్రమే ఉంది. 90-95 శాతం ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయని వక్తలు చెప్పారు.

మరిన్ని వార్తలు