త్వరలో ఎఫ్‌టీఏ ఓ కొలిక్కి

12 Sep, 2023 06:36 IST|Sakshi

భారత్, బ్రిటన్‌ ప్రకటన

న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, వర్తకానికి బాటలు పరిచే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను వీలైనంతగా త్వరగా కొలిక్కి తెస్తామని భారత్, బ్రిటన్‌ ప్రకటించాయి. జీ20 సదస్సులో భాగంగా భారత్‌కు విచ్చేసిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి జెరిమి హంట్‌.. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో విడిగా భేటీ అయ్యారు. 12వ విడత ఇండియా–యూకే ఎకనమిక్, ఫైనాన్షియల్‌ డైలాగ్‌ పేరిట జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ఆర్థిక మంత్రులిద్దరూ చర్చలు జరిపారు.

‘ ప్రధానంగా పెట్టుబడులపై చర్చించాం. చర్చలను వేగవంతం చేసి కొన్ని ఒప్పందాలపై తుది సంతకాలు జరిగేందుకు కృషిచేస్తున్నాం’ అని తర్వాత నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే భారతీయ ఉత్పత్తులు తక్కువ కస్టమ్స్‌ సుంకాలతో బ్రిటన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టగలవు. ధర తక్కువ ఉండటంతో వాటికి అక్కడ గిరాకీ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో భారత్‌లో పారిశ్రామికోత్పత్తి ఎగసి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. బ్రిటన్‌ వస్తువులు సైతం తక్కువ ధరకే భారత్‌లో లభిస్తాయి. ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరమైన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా అమల్లోకి రావాలని మార్కెట్‌వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని వార్తలు