శామ్కో నుంచి డైనమిక్‌ అస్సెట్‌ ఫండ్‌

4 Dec, 2023 06:05 IST|Sakshi

ముంబై: శామ్కో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ‘డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌’ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు, మార్కెట్ల కరెక్షన్లలో రక్షణ ప్రయోజనాలతో ఈ పథకం ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లలో మరీ ప్రతికూల పరిస్థితులు కనిపించిన సందర్భాల్లో పెట్టుబడులను పూర్తిగా డెట్‌లోకి మార్చడం ఈ పథకం విధానంలో భాగంగా ఉంటుంది.

పెట్టుబడులు అన్నింటినీ డెట్‌కు మార్చే తొలి డైనమిక్‌ అస్సెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ ఇదేనని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారినప్పుడు అవసరమైతే నూరు శాతం పెట్టుబడులను అందులోకి మళ్లించగలదు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీల మధ్య పెట్టుబడులను మారుస్తూ, రిస్క్‌ తగ్గించి, మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. డిసెంబర్‌ 7 నుంచి 21వ తేదీ వరకు ఈ నూతన పథకం (ఎన్‌ఎఫ్‌వో) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు