నెలలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌

18 Jul, 2017 00:12 IST|Sakshi
నెలలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌

కో లొకేషన్‌ అంశంపై పరిష్కారమే తొలి ప్రాధాన్యం
ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ లిమాయే  

న్యూఢిల్లీ: కో లొకేషన్‌ అంశంపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నెలలోపు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక సమర్పించనుందని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) నూతన ఎండీ విక్రమ్‌ లిమాయే తెలిపారు. దీనిపై సకాలంలో తగిన పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం లిమాయే మీడియాతో మాట్లాడారు. కో లొకేషన్‌ అంశాన్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు. ఈ విషయంలో సెబీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

కొంత మంది బ్రోకర్లు ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై సత్వరమే లాగిన్‌ అయ్యేందుకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసుకుని యాక్సెస్‌ పొందారనే ఆరోపణలు రావడం విదితమే. ఈ విధంగా బ్రోకర్లు కరెన్సీ, డెరివేటివ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీగా లాభపడ్డారని ఆరోపణలు రావడంతో సెబీ దర్యాప్తు మొదలు పెట్టింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సైతం ఆడిట్‌ బాధ్యతల్ని ఈవైకి అప్పగించింది. ఎక్స్ఛేంజ్‌ వైపు ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని లిమాయే చెప్పారు.

ఆ తర్వాతే ఐపీవో: కో లొకేషన్‌పై దర్యాప్తు ముగిసి ఈ అంశం పరిష్కారమైన తర్వాతే ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ఉంటుందని టీవీ చానళ్లతో మాట్లాడుతూ లిమాయే చెప్పారు. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, క్లయింట్లు, మీడియా, ఉద్యోగులతో సంబంధాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయని హామీ ఇచ్చారు. ఇటీవల ఎన్‌ఎస్‌ఈ 3 గంటల పాటు నిలిచిపోవడంపై స్పందిస్తూ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు అసాధారణమేమీ కాదన్నారు. దీనిపై నివేదిక కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ టెక్నాలజీ స్టాండింగ్‌ కమిటీ సమస్యను సమీక్షించి భవిష్యత్తులో ఈ తరహా అవాంతరాలు ఎదురవకుండా తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తుందన్నారు. సమస్యకు మూల కారణంపై ఆర్థిక శాఖకు, సెబీకి నివేదిక ఇస్తామని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈని మరింత మెరుగైన స్థానంలో నిలిపేందుకు అందరం కలసి కట్టుగా పనిచేద్దామని అంతకుముందు ఉద్యోగులకు లిమాయే పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు