మన వృద్ధి తీరుపై నవ్వే రోజులు పోయాయ్

19 Mar, 2016 01:14 IST|Sakshi
మన వృద్ధి తీరుపై నవ్వే రోజులు పోయాయ్

సంస్కరణలతో వృద్ధి జోరు: ఆర్థికమంత్రిజైట్లీ
న్యూఢిల్లీ: మన అత్యల్ప వృద్ధి తీరును చూసి ప్రపంచం అపహాస్యం చేసే రోజులు పోయాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాత దీర్ఘకాలం పాటు సాధించిన కేవలం 2-2.5 శాతం సగటు వృద్ధి తీరును చూసి ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా ప్రపంచం అపహాస్యం చేసేదని,  ఇప్పుడు ఇక ఆ రోజులు లేవని ఆయన ఇక్కడ జరిగిన స్కోచ్ 43వ సదస్సును ఉద్దేశించి పేర్కొన్నారు. భారత్‌లో 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ చర్యలు, సంస్కరణలు వృద్ధి రేటును వేగవంతం చేస్తున్నాయని అన్నారు. ఒక దశలో ఈ రేటు 10 శాతానికి చేరిందన్న విషయాన్ని గుర్తు చేశారు. 

1991న ప్రారంభమైన సంస్కరణల ప్రక్రియ అంతకు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైవుంటే... భారత్ మరెంతో ఆర్థికవృద్ధి సాధించి ఉండేదని అన్నారు.  ఇప్పుడు సంస్కరణలను వ్యతిరేకించేవారికన్నా... అనుకూలంగా మాట్లాడేవారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.  పేదరిక నిర్మూలన పథకాల అమలుకు తగిన నిధుల కల్పనకు వీలుగా దేశం వేగవంతంగా వృద్ధి సాధిస్తోందన్నారు. కేవలం అధిక దేశాభివృద్ధి రేటు ద్వారానే ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి సామాజిక అంశాల్లో పురోగతికి వీలవుతుందని వివరించారు. భారత్ ఆర్థిక సంస్కరణల ప్రక్రియపై స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ రాసిన పుస్తకాన్ని జైట్లీ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు