వన్‌ప్లస్ మొబైల్స్ ‘మేక్ ఇన్ ఇండియా’

12 Oct, 2015 00:44 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న చైనా స్టార్టప్ కంపెనీ వన్‌ప్లస్.. బెంగళూరు వేదికగా నేడు కొత్త మోడల్ ఆవిష్కరణతోపాటు మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. ఫోన్ల తయారీకిగాను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలైన ఫాక్స్‌కాన్ తదితర సంస్థలతో కంపెనీ చర్చిస్తోంది. మేక్ ఇన్ ఇండియా ఫోన్‌ను ఈ ఏడాదే తీసుకొస్తామని వన్‌ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అయితే సోమవారం నాటి అధికారిక ప్రకటన గురించి సమాధానం దాటవేశారు.

బెంగళూరు కార్యక్రమానికి సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో పీట్ లూ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. వన్‌ప్లస్ మూడో మోడల్ పేరు ‘ఎక్స్’ లేదా ‘మినీ’ అని సమాచారం. 5 అంగుళాల స్క్రీన్, 1.9 గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీ, 1,920/1,080 రిసొల్యూషన్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వన్‌ప్లస్ వన్, వన్‌ప్లస్-2 మోడళ్ల కంటే ఇది తక్కువ ధర ఉంటుంది. ఇక ఎటువంటి ఇన్విటేషన్ లేకుండానే వన్‌ప్లస్-2 కొనుక్కోవచ్చు. సోమవారం మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్య అమెజాన్ ద్వారా ఈ అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు