ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు

29 Mar, 2016 00:54 IST|Sakshi
ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: కేజీ బేసిన్ డీ5 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌ల్లో ఆయిల్, గ్యాస్ వెలికితీత కోసం ప్రభుత్వ రంగ సంస్థ, ఓఎన్‌జీసీ 500 కోట్ల డాలర్లు(రూ.34,000 కోట్లు) పెట్టుబడులు పెడుతోంది. ఈ చమురు క్షేత్రాల నుంచి 2019 జూన్ కల్లా తొలి గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని, ఇక చమురు ఉత్పత్తి మార్చ్ 2020 కల్లా మొదలవుతుందని ఓఎన్‌జీసీ సీఎండీ డి.కె. సరాఫ్ చెప్పారు. బంగాళాఖాతంలోని కేజీ-డీడబ్ల్యూఎన్-98/2(కేజీ-డీ5)లోని 10 ఆయిల్, గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి కోసం 507.6 కోట్ల డాలర్ల పెట్టుబడులకు ఓఎన్‌జీసీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు.

ప్రభుత్వ కొత్త ధరల విధానంలో కేజీ-డీ5 నుంచి చమురు, గ్యాస్ వెలికితీత ప్రయోజనకరమేనని, అందుకే ఈ పెట్టుబడుల ప్రణాళికలకు బోర్డ్ ఆమోదం తెలిపిందని  వివరించారు.  ఉత్పత్తి ప్రారంభమైన రెండేళ్లకు రోజుకు 77,305 బ్యారెళ్ల చమురును, 16.56 మిలియన్ స్టాండర్డ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తామని వివరించారు. ఈ క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్‌ను ఫిక్స్‌డ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఓడలరేవు ఆన్‌షోర్ టెర్మినల్ ద్వారా బయటకు తేవాలనే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు