పెరిగో కంపెనీకి మైలాన్ ఆఫర్

26 Apr, 2015 01:34 IST|Sakshi

- తెవా బిడ్‌ను తప్పించుకోవటానికి వ్యూహం
- 31.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఆఫర్

న్యూయార్క్: అమెరికన్ ఫార్మా దిగ్గజం పెరిగోను కొనుగోలు చేయడానికి యూకే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ మైలాన్ లాబొరేటరీస్ రంగంలోకి దిగింది. 31.2 బిలియన్ డాలర్లకు పెరిగోను కొనుగోలు చేసేలా... ఆ కంపెనీ షేర్ హోల్డర్లకు ఆఫర్ ప్రకటించింది.

ఈ ఆఫర్ మేరకు... పెరిగో కంపెనీ వాటాదార్లకు ఒకో వాటాకు 60 డాలర్లతో పాటు మైలాన్‌కు చెందిన 2.2 షేర్లు కూడా ఇస్తారు. దీనిప్రకారం ఒకో పెరిగో షేరుకు 222.12 డాలర్లు చెల్లించినట్లవుతుంది. ప్రస్తుతం నాస్‌డాక్‌లో పెరిగో షేరు ధర 192 డాలర్ల వద్ద ఉండగా తాజా ఆఫర్ 30 డాలర్లు ఎక్కువ కావటం గమనార్హం. అయితే పెరిగో యాజమాన్యం మాత్రం ఈ బిడ్ చాలా తక్కువని  వాదిస్తోంది.

మైలాన్‌ను 40 బిలి యన్ డాలర్లకు కొనుగోలు చేస్తామంటూ ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా ఫార్మా 5 రోజుల కిందట ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్ వల్లే మైలాన్ షేరు ధర బాగా పెరిగిం దని, ఆ పెరిగిన ధర ప్రకారం మైలాన్‌కు చెం దిన రెండు షేర్ల విలువను లెక్కిస్తున్నారు తప్ప ఆఫర్‌కన్నా ముందు మైలాన్ ధరను పరిగణనాలోకి తీసుకోవటం లేదని పెరిగో పేర్కొం టోంది. తమ కంపెనీకి ఉన్న భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకుంటే ఈ ధర చాలా తక్కువంటోంది.
 
జరిగింది ఇదీ..
ఈ వారం మొదట్లో మైలాన్‌ను బలవంతంగా కొనుగోలు చేయడానికి తెవా ఫార్మా ఏకంగా 40.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వటంతో సంచలనం మొదలైంది. దీన్ని తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే మైలాన్ ఈ పెరిగో డీల్‌కు తెరలేసింది. ఒకవేళ పెరిగోను మైలాన్ కొనుగోలు చేస్తే ఈ రెండిం టినీ కలిపి కొనేంత శక్తి తెవాకు ఉండదు. మైలాన్ తాజా ప్రతిపాదన చేయక ముందువరకూ తెవా ఆఫర్ బాగానే కనిపించినా... ఇపుడు మాత్రం కళ తప్పినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు