చిన్న ఇన్వెస్టర్లకూ పరిహారం!

27 Jan, 2017 06:51 IST|Sakshi
చిన్న ఇన్వెస్టర్లకూ పరిహారం!

తాజా ఓపెన్‌ ఆఫర్‌కు త్వరలో సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రుణ ఎగవేతలతో బ్యాంకులను ముంచేసిన విజయ్‌ మాల్యాపై స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కొరఢా ఝలిపిస్తోంది. గతంలో యునైటెడ్‌ స్పిరిట్స్‌ చైర్మన్, బోర్డు పదవుల నుంచి వైదొలగడం కోసం బ్రిటన్‌ కంపెనీ డియాజియోతో కుదుర్చుకున్న 75 మిలియన్‌ డాలర్ల డీల్‌కు సంబంధించి అవకతవకలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ డీల్‌ కారణంగా యునైటెడ్‌ స్పిరిట్స్‌(యూఎస్‌ఎల్‌)లో చిన్న ఇన్వెస్టర్లకు నష్టం వాటిల్లిందన్న ఆందోళనల నేపథ్యంలో సెబీ దీనిపై దర్యాప్తు చేపట్టింది.

తాజా ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా చిన్న ఇన్వెస్టర్లకు అదనంగా చెల్లించాలంటూ డియాజియోను త్వరలో సెబీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. కాగా, యునైటెడ్‌ స్పిరిట్స్‌ నుంచి నిధులను అక్రమంగా దారిమళ్లించిన ఆరోపణలపై మాల్యాతోపాటు మరో ఆరుగురిని సెక్యూరిటీస్‌ మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా సెబీ బుధవారం నిషేధం విధించడం తెలిసిందే.

అదేవిధంగా మల్యా, యునైటెడ్‌ స్పిరిట్స్‌ మాజీ ఎండీ అశోక్‌ కపూర్‌ను లిస్టెడ్‌ కంపెనీల్లో డైరెక్టర్‌ పదవులేవీ చేపట్టకూడదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. యూఎస్‌ఎల్‌లో మెజారిటీ వాటాను 2012లో డియాజియోకు విక్రయించడంతో నియంత్రణ మొత్తం ఆ కంపెనీ చేతికి వెళ్లిపోయింది. అయితే, బోర్డు, చైర్మన్‌ పదవి నుంచి మాత్రం వైదొలిగేందుకు మల్యా నిరాకరించారు. దీంతో మాల్యాతో కుదుర్చుకున్న సెటిల్‌మెంట్‌ మేరకు ఆయనకు 75 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు డియాజియో ఒప్పందం కుదుర్చుకుంది. ఆతర్వాత మాల్యా యూఎస్‌ఎల్‌ నుంచి పూర్తిగా వైదొలిగారు.

అయితే, ఈ డీల్‌ కారణంగా యూఎస్‌ఎల్‌ కొత్త ప్రమోటర్లయిన డియాజియోకు భారీగా యాజమాన్య ప్రయోజనాలు లభించాయని, అదేవిధంగా పాత ఓనర్‌ మాల్యాకు కూడా పెద్దమొత్తంలో లాభం చేకూరినట్లు దర్యాప్తులో సెబీ తేల్చింది. చిన్న(మైనారిటీ) వాటాదారులకు మాత్రం దీనివల్ల నష్టం వాటిల్లిందన్న అంచనాకు వచ్చింది. దీంతో తాజా ఓపెన్‌ ఆఫర్‌ద్వారా ఇన్వెస్టర్లకు అదనపు చెల్లింపు చేయాలని త్వరలో ఆదేశించే అవకాశాలు ఉన్నాయని సెబీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

సెబీ నిషేధంపై మాల్యా ఉక్రోషం...
సెబీ నిషేధంపై మాల్యా తీవ్ర ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. యూఎస్‌ఎల్‌ నుంచి నిధులు మళ్లింపు ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. తాజా పరిణామాలపై ఆయన ట్వీటర్‌లో వరుసపెట్టి అనేక ట్వీట్‌లు చేశారు. ‘కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి నిధులను మళ్లించానని సీబీఐ ఆరోపిస్తోంది. మరోపక్క, యూఎస్‌ఎల్‌ నుంచి కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లోకి నిధులను మళ్లించారనేది సెబీ ఆరోపణ. ఇది జోక్‌ కాకపోతే మరేంటి?’ అని మల్యా ట్వీట్‌ చేశారు.

చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తనను ప్రభుత్వంతో పాటు అన్నివైపుల నుంచి వెంటాడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘30 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిట్స్‌ కంపెనీ, భారత్‌లో అతిపెద్ద బ్రూవింగ్‌ కంపెనీతో పాటు అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పా. దీనికి నాకు లభించిన ప్రతిఫలం ఇది’ అంటూ మల్యా మరో ట్వీట్‌ చేశారు. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణ ఎగవేతల కేసుల్లో చిక్కుకున్న మాల్యా.. లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు