అనవసర నియంత్రణలకు చెల్లు

18 Nov, 2014 00:36 IST|Sakshi
అనవసర నియంత్రణలకు చెల్లు

బ్రిస్బేన్: అనవసరమైన చట్టాలు, నియంత్రణలను తొలగించడం ద్వారా పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరంగా చేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వ్యాపారాలకు అనుకూలంగా పారదర్శక విధానాలను అమల్లోకి తెస్తున్నామని, ఈ మేరకు భారత్‌లో మార్పును చూడొచ్చని ఆయన తెలిపారు. క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్ట్రేలియా ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు.

 ‘గుడ్ గవర్నెన్స్ అన్నది మార్పునకు నాంది. సాధారణ పౌరుల విషయంలోనే కాదు.. వ్యాపారాలకు కూడా ఇది చాలా ముఖ్యం. అనుకూల పరిస్థితులు ఉంటే అవకాశాలను ఉభయతారకమైన భాగస్వామ్యాలుగా మల్చుకోవచ్చు. ఈ దిశగా మేం వ్యాపారాలకు అనుకూలమైన పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చాం. మరిన్ని తెస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంధనం, ఖనిజ సంపద, వ్యవసాయం, ఆహార భద్రత తదితర అంశాల్లో భారత్ పురోగమించడంలో క్వీన్స్‌ల్యాండ్ కీలక భాగస్వామి కాగలదన్నారు.

 వ్యవసాయోత్పత్తిని మెరుగుపర్చేందుకు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు అవసరమైన పరిశోధనలను ఇరు దేశాలు సంయుక్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. అలాగే ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీల విషయంలోనూ కలిసి పనిచేయాలని ఆయన తెలిపారు. పర్యాటక రంగంపరంగా కూడా ప్రత్యేకత ఉన్న క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు భారతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు.

భారత్‌లో తయారీకి ఊతమిచ్చే విధంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మోదీ తెలిపారు. 100 స్మార్ట్ సిటీలు, 50 మెట్రో ప్రాజెక్టులు మొదలైన బృహత్తర ప్రాజెక్టులను తలపెట్టినట్లు వివరించారు. వీటిలో పాలుపంచుకోవాలని క్వీన్స్‌ల్యాండ్ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థికంగా, భద్రతాపరంగా సమగ్రమైన బంధం ఉందని, అంతర్జాతీయ వేదికల్లో రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన తెలిపారు.

ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం నెలకొనడానికి ఇది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. జీవీకే, అదానీ గ్రూప్‌లు చేపట్టిన భారీ మైనింగ్ ప్రాజెక్టులకు తోడ్పాటునిచ్చేలా రైలు రవాణాపరమైన మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి పెట్టనున్నట్లు మోదీతో భేటీలో క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ క్యాంప్‌బెల్ న్యూమన్ హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని గెలిలీ బేసిన్‌లో  భారతీయ కంపెనీలు భారీ ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నాయి. కార్‌మైఖేల్ గనిపై అదానీ గ్రూప్ 16.5 బిలియన్ డాలర్లు, అల్ఫా మైన్‌పై జీవీకే గ్రూప్ 6 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నాయి.

 అదానీ ఆస్ట్రేలియా బొగ్గు ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్...
 మెల్‌బోర్న్: భారత ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 7 బిలియన్ డాలర్ల బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు ఈ ప్రాజెక్ట్‌కు మద్దతుగా నిలిచే రైల్వే మౌలికసదుపాయాల పెట్టుబడులకు సైతం ఓకే చెప్పింది.గెలిలీ బేసిన్‌లో తలపెట్టిన కార్‌మైఖేల్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు అనుమతి లభించడాన్ని స్వాగతిస్తున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది.

ఈ అంశంపై అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా కంట్రీ హెడ్ జయకుమార్ జనక్‌రాజ్ స్పందిస్తూ దీర్ఘకాలంగా కంపెనీ చేస్తున్న కృషికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు. ప్రణాళికలో భాగంగా 2017కల్లా బొగ్గును వెలికితీయగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గెలిలీ బేసిన్‌లో తలపెట్టిన మూడు ప్రాజెక్ట్‌ల ద్వారా 28,000 మందికి ఉపాధి లభించే అవకాశమున్నట్లు అంచనా. వీటిలో జీవీకే అల్ఫామైన్, క్లైవ్ పామర్ వారతా కోల్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ 11 బిలియన్ టన్నుల థర్మల్ బొగ్గు నిల్వలున్నట్లు అంచానా. కాగా, కార్‌మైఖేల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి  ఎస్‌బీఐతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పం దాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలోభాగంగా ఎస్‌బీఐ  బిలియన్ డాలర్లవరకూ రుణాన్ని ఇవ్వనుంది. ఎస్‌బీఐతో ఎంవోయూ  ఒక మెలురాయికాగా,  క్వీన్స్‌లాండ్‌లో ఇది విలువైన పెట్టుబడని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు