ఈ పెట్టెలో పెన్నిధి ఉందా?

18 Nov, 2014 00:38 IST|Sakshi
ఈ పెట్టెలో పెన్నిధి ఉందా?

నరేంద్రపురం (పి.గన్నవరం) : మండలంలోని నరేంద్రపురంలో పాడుబడ్డ ఓ గృహం ఇప్పుడు ఆ ఊళ్లోనే కాక పరిసర గ్రామాల్లోనూ ఊహాగానాలకు కేంద్రబిందువైంది. శిథిలమైన ఆ ఇంటిని తొలగిస్తుం డగా సోమవారం బయటపడ్డ ఓ ఇనుపపెట్టె అందుకు కారణం. ‘ఆ పెట్టెలో ఏముంది? మేలిమి బంగారమా? నవరత్నాలు పొదిగిన నగలా?’ అన్న కుతూహలం ప్రతి వారి మదిలో చెలరేగుతోంది. అది తేలాలంటే మంగళవారం వరకూ ఆగాల్సిందే. స్థానిక శివాలయం వీధిలో భూస్వామి ఈమని రామగోపాలానికి చెందిన పెంకుటింటిలో సుమారు 40 ఏళ్ల నుంచి ఎవరూ నివసించడం లేదు. పిల్లలు లేని రామగోపాలం, అచ్యుతమ్మ దంపతులు పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం వెళ్లిపోయి బంధువుల కుమారుడు వెంకట జగన్నాథశాస్త్రిని దత్తత తీసుకున్నారు.
 
 25 ఏళ్ల క్రితం అచ్యుతమ్మ, 20 ఏళ్ల క్రితం రామగోపాలం మరణించారు. ఇన్నేళ్లలో ఆ ఇల్లు పాడుబడి, శిథిలమై పాములకు నెలవుగా మారింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఇంటిని తొలగించాలని శాస్త్రిని కోరారు. ఆదివారం వచ్చిన ఆయన కొబ్బరికాయ కొట్టి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టి వెళ్లిపోయారు. సోమవారం జేసీబీతో ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా తాళం వేసి ఉన్న పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. దాంతో ఆ ఇంట్లో గుప్తనిధులు బయటపడ్డాయని, లంకెబిందెలు లభించాయని క్షణాల్లో ఊరంతా ప్రచారం జరిగింది.
 
 ఇంటి యజమానులు భూస్వాములు కావడం ఆ ప్రచారానికి ఊతమిచ్చింది. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రి 8.30 గంటలకు గ్రామానికి చేరుకుని ఇనుప పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. పి.గన్నవరం ఏఎస్సై ఎన్.సత్యనారాయణ, ఆర్‌ఐ బొరుసు లక్ష్మణరావు, వీఆర్వో తటవర్తి కృష్ణ పెట్టెను పరిశీలించారు. శాస్త్రి వచ్చాక ఆయన సమక్షంలో మంగళవారం పెట్టెను తెరవాలని నిర్ణయించారు. అంతవరకూ పోలీసులకు కాపలాగా ఉంచారు. అంటే.. పెట్టె తెరిచే వరకూ పట్టరాని కుతూహలం తప్పదన్న మాట.
 

మరిన్ని వార్తలు