కరెన్సీ స్థిరత్వంపైనే దృష్టి: ఆర్‌బీఐ

30 Jul, 2013 05:00 IST|Sakshi
కరెన్సీ స్థిరత్వంపైనే దృష్టి: ఆర్‌బీఐ

 ముంబై: రూపాయి మారకపు విలువ ఒడిదుడుకుల నివారణే తన ప్రథమ ప్రాధాన్యతని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  స్పష్టం చేసింది. రూపాయి క్షీణత నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడి,  కఠిన లిక్విడిటీ నిర్వహణే తన ముందున్న ప్రధానాంశాలని తెలిపింది. తద్వారా వడ్డీరేట్లలో యథాతథ పరిస్థితి కొనసాగవచ్చన్న సంకేతాలు ఇచ్చింది.  2013-14లో వృద్ధి రేటు ఇంతక్రితం 6 శాతం నుంచి 5.7 శాతానికి నివేదిక కుదించింది. మంగళవారం మొదటి త్రైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో ఆర్‌బీఐ సోమవారం స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై తన నివేదికను విడుదల చేసింది.  సెప్టెంబర్ 4న ఆర్‌బీఐ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు బాధ్యతల నుంచి వైదొలగనున్న నేపథ్యంలో-ఆయన నేతృత్వంలో జరుగుతున్న  త్రైమాసిక పరపతి విధాన చివరి సమీక్ష ఇది. ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
 
 క్యాడ్‌పై ఆందోళన: రూపాయి ఒడిదుడుకుల ప్రధాన కారణాల్లో ఒకటైన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య వ్యత్యాసం) కట్టడికి కఠిన చర్యలు అవసరం. రూపాయి ఒడిదుడుకుల నివారణకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు తక్షణం కొంత ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. అయితే క్యాడ్ కట్టడికి తీసుకునే వ్యవస్థాగత చర్యల పైనే ఆయా నిర్ణయాల (ఆర్‌బీఐ) విజయం ఆధారపడి ఉంటుంది. గతేడాది 4.8 శాతం క్యాడ్‌తో పోల్చితే 2013-14లో ఈ రేటు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఏప్రిల్ క్యాడ్ పరిమాణం (3.8 శాతం)తో పోల్చితే ప్రస్తుత జూన్ క్వార్టర్‌లో పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇన్వెస్టర్ విశ్వాసం సన్నగిల్లడం వల్ల మే చివరి వారం నుంచీ 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కిపోయాయి. ఇది క్యాడ్ ఆర్థిక కోణంలో ఇబ్బందికర అంశం.


 వృద్ధిపై ఇలా...: వృద్ధికి స్థూల ఆర్థిక పరిస్థితులు దోహదపడతాయి. అయితే ఇప్పుడు ఈ కోణంలో రూపాయి ఒడిదుడుకులు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బం దిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్‌లో స్థిరత్వాన్ని తిరిగి తీసుకురావడమే పరపతి విధాన ప్రాధాన్యత.  క్యాడ్ కట్టడి, పొదుపు, పెట్టుబడుల రేట్లు పెరగడం ఈ దిశలో అవసరం. వ్యవస్థాపరమైన అడ్డంకుల వల్ల ఆర్థిక రికవరీ ఇంకా మందగమనంలో కొనసాగొచ్చు. 2014 మార్చి నాటికి డాలర్ మారకంలో రూపాయి ఇంచుమించు ప్రస్తుత విలువలోనే 59.5 స్థాయిలో ఉంటుంది. ఇంతక్రితం అంచనా 54గా ఉంది.
 
 ద్రవ్యోల్బణంపై ఆందోళన
 వృద్ధి-ద్రవ్యోల్బణం ప్రాతిపదికనే కాకుండా, అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, సవాళ్ల ప్రాతిపదికన సైతం పరపతి విధానం ఆధారపడి ఉంటుంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గడచిన 15 నెలల నుంచీ రెండంకెల స్థాయి వద్దే కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు